దుబ్బాకలో మొదలైన కాక
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫీవర్ మొదలైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 55 అసెంబ్లీ స్థానాలతో పాటు దుబ్బాకకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక నియోజకవర్గంపై దృష్టి సారించనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానుంది. ఉప ఎన్నికే అయినా.. వెంటనే వరుసగా ఇతర ఎన్నికలు రానుండటంతో ఇక్కడ ఆయా పార్టీలు సాధించే ప్రజాభిమానం భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తుండగా, రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఈ మూడింటికి మద్దతు తెలిపేందుకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.