గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిదే: బాలకిషోర్
డాక్టర్ ఎస్.బాలకిషోర్,
కన్సల్టెంట్ ఇన్వాసివ్ కార్డియాలజిస్ట్,
కిమ్స్ సవీర, అనంతపురం.
హృదయ సంబంధ వ్యాధులను “సైలెంట్ కిల్లర్స్” గా పేర్కొంటారు .కాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్ల కలుగుతున్నాయంటే ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. మిగతా వ్యాధులలో మాదిరిగా స్పష్టమైన సంకేతాలు కబడినా… అవగాహనా లోపం వల్ల వాటిని హృదయ సంబంధ సమస్యలుగా గుర్తించడం లేదు. గుండె జబ్బు అంటే మనకు గుండె పోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. గుండెపోటు అతి పెద్ద సమస్యే కానీ వాస్తవానికి గుండెకు సంబంధించి అదొక్కటే కాదు, మరికొన్ని కీలక సమస్యలూ ఉన్నాయి.
- గుండెకు ఆపరేషన్ అంటే మనకు ఛాతీ మొత్తం తెరచి చేసే బైపాస్ ఆపరేషన్ ఒక్కటే గుర్తుకొస్తుంది. కానీ వాస్తవానికి అత్యాధునిక విజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ ఛాతీ తెరవాల్సిన అవసరం లేకుండానే బైపాస్ సర్జరీని ముగించే విధానాలూ మన ముందుకొస్తున్నాయి.
గుండెలో విద్యుత్తు
మన గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేస్తుంటుంది. మన గుండె నిరంతరం కొట్టుకోవటానికి ,సైనో ఏట్రియల్ నోడ్ (ఎస్‌ఏ నోడ్), ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీ నోడ్) ,నుంచి నిరంతరం విద్యుత్ ప్రేరేపణలు వెలువడుతుంటాయి. దాంతో రక్తం వేగంగా నెట్టినట్టుగా కింది గదులైన జఠరికల్లోకి , ధమనుల్లోకి పంప్ అవుతుంది. ఇదంతా ఒక క్రమపద్ధతిలో, లయాత్మకంగా, నిరంతరాయంగా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతితప్పి, గుండె లయ దెబ్బతినొచ్చు. దీన్నే అరిత్మియాసిస్ అంటారు. దీంతో గుండె కొట్టుకునే వేగం క్రమంగా తగ్గటం(బ్రాడీకార్డియా), అనూహ్యంగా పెరగటం (టెకీకార్డియా) వంటి పరిస్థితులు తలెత్తవచ్చు.
వేగం తగ్గితే? - రక్త సరఫరా తగ్గటం వల్ల మెదడుకు తగినంత రక్తం అందదు.
- శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది.
- అలసట, నిస్సత్తువగా అనిపిస్తుంది.
- నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే? - గుండె దడ వస్తుంది.
- పూర్తి సామర్థ్యంతో గుండె కొట్టుకోలేకపోవటం వల్ల రక్తం అన్ని అవయవాలకు చేరదు. ఫలితంగా
విపరీతమైన ఆయాసం వస్తుంది. - కొన్నిసార్లు గుండెలో కొద్దిపాటి నొప్పిగా కూడా ఉండొచ్చు.
- తల చాలా తేలికగా ఉన్నట్టు, తిరిగినట్టు అనిపిస్తుంది.
- సృహా తప్పటం వంటింవి జరగొచ్చు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు - ఈసీజీ
- 2డి ఎకో
- హోల్టర్ పరీక్ష (24 గంటల పాటు గుండె పనితీరుని తెలుసుకోవటానికి చేసే ప్రత్యేక ఈసీజీ పరీక్ష)
- అవసరమైతే ఎలక్ట్రో ఫిజియాలజీ పరీక్షనూ చేయాల్సి ఉంటుంది.
చికిత్స
గుండె వేగం తగ్గినపుడు ఛాతీ పైభాగంలో చర్మం కింద పేస్ మేకర్ అమర్చి సరిదిద్దుతారు. వీటిల్లో సింగిల్ ఛాంబర్, డబుల్ ఛాంబర్ పేస్‌మేకర్లతో పాటు అత్యాధునికమైన ట్రిపుల్ ఛాంబర్ పేస్‌మేకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్, గుండె లయను క్రమబద్ధీకరించే మందులు ఇస్తారు.
ఐసీడీ: గుండె చాలా వేగంగా కొట్టుకోవటం అనేది ఒకోసారి గుండె ఆగిపోవటానికి దారితీయొచ్చు. ఇలాంటి సమయాల్లో గుండెకు చిన్నగా విద్యుత్ షాక్ ఇచ్చి దాన్ని గాడిలో పెడతారు. ఇది ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఆసుపత్రిలో లేని సమయాల్లో అలాంటి పరిస్థితి వస్తే ఉపయోగపడేందుకు ఇంప్లాంటేబుల్ కార్డియోవెర్టర్ డిఫిబ్రిలేటర్ (ఐసీడీ)ని అమరుస్తారు. ఇది గుండె ఆగిపోవటానికి దారితీసే ప్రమాదకరమైన స్పందనని ముందే గుర్తించి ఒకసారి షాక్‌ను వెలువరిస్తుంది. దీంతో గుండె కొట్టుకోవడం మళ్లీ గాడిలో పడుతుంది. - గుండెకు విద్యుత్‌ను సరఫరా చేసే మార్గాల్లో అడ్డంకులు ఏర్పడితే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో రక్తనాళం ద్వారా సన్నటి తీగలను గుండెలోకి పంపించి తరంగాల సాయంతో గుండె లయ తప్పటానికి కారణమయ్యే సంకేతాలను ధ్వంసం చేస్తారు.
చిన్నకోత
హృదయం చాలా సున్నితమైనది. ఓపెన్ హార్ట్ సర్జరీ సురక్షితంగా తయారైంది. అయితే ఇలా ఆపరేషన్ చేస్తే- ఎదరొమ్ము ఎముకల్ని కట్‌చేసి, ఛాతీ మీద 10-12 అంగుళాల కోత పెట్టక తప్పదు. ఈ ఛాతీ ఎముక తిరిగి అతుక్కోవటానికి, ఆ గాయం మానటానికి ఎక్కువ సమయమే పడుతుంది. వారం పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి. ఆ తర్వాత 3 నెలల పాటు ఇంట్లో పూర్తి విశ్రాంతి తప్పదు. పైగా ఛాతీని తెరచి ఆపరేషన్ చేసేటప్పుడు చాలామందికి కృత్రిమంగా హార్ట్-లంగ్ మెషీన్ వాడటం వల్ల రక్తస్రావం, రక్తం ఎక్కువగా ఎక్కించాల్సి రావటం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు, పక్షవాతం వంటివి వచ్చే అవకాశమూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చిన్నకోతతో గుండె ఆపరేషన్ పూర్తిచేసే కీ హోల్ సర్జరీ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఛాతీ ఎముకలను కట్‌చేసి తెరవాల్సిన పనిలేకుండా చిన్న రంధ్రాన్ని మాత్రమే చేసి థొరాకోస్కోపీ సాయంతో బైపాస్ సర్జరీ, కవాట మార్పిడి వంటివి చేయొచ్చు. పెద్దకోత ఉండదు కాబట్టి చాలా త్వరగా కోలుకుంటారు.
నివారణ మార్గాలు
గుండె జబ్బులు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించటం అత్యవసరం. - ధూమపానం చేయవద్దు
- ఒకేచోట కదలకుండా కూర్చోవద్దు
- సమతులాహారం తీసుకోవాలి
- కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి
- రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
- బరువు పెరగకుండా చూసుకోవాలి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి
- తగినంత నిద్ర పోవాలి
- ఒత్తిడిని దరిజేరనీయరాదు
- ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.71 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే.
- మన దేశంలో చిన్నవయసులోనే ముఖ్యంగా 30, 40 ఏళ్ల వయస్సు ఉన్న ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు. మనకున్న అలవాట్లే మనల్ని జబ్బలకు గురిచేస్తున్నాయి. నిరంతరాయంగా పనిచేసే గుండెకు మనమే హాని తలపెడుతున్నాం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేని జీవనశైలి, ధూమపానం, వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్నాం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యం గురించి సామన్యుల్లో అవగాహాన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది.