తెలుగు రాష్ట్రలపై కన్నేసిన భాజపా
తెలుగు రాష్ట్రాలపై బిజెపి అగ్ర నాయకత్వం కన్నేసింది. జాతీయ స్థాయి కొత్త కార్యవర్గానికి సంబంధించి బిజెపి శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగువాళ్లకు స్థానం కల్పించింది. జెపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా భాధ్యతలు చేపట్టిన దాదాపు 8 నెలల తర్వాత జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. 70 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. తెలంగాణ నుంచి లక్ష్మణ్, డికె అరుణ, ఏపీ నుంచి పురంధేశ్వరీ ఉన్నారు. ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అవకాశం దక్కింది. డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. అలాగే ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌లను కార్యవర్గంలో చోటు కల్పించారు.
బిసిలకు బిజెపి వ్యతిరేకమన్నది తప్పు..
తనను జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షునిగా నియమించినందుకుగానూ లక్ష్మణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన మీద నమ్మకంతో ఓబీసీ మోర్చా అధ్యక్షుడుని చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదులు తెలిపారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందనీ, కేంద్ర నేతలతో కలిసి జాతీయస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సజయ్ నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకం అనేది తప్పు అని మీడియాతో తెలిపారు. అత్యధిక ఎస్సి, ఎస్టీ, ఓబీసీ, మహిళా ప్రజా ప్రతినిధులు బీజేపీలోనే ఉన్నారని తెలిపారు