ప్రశ్నలడితే సప్పుడు చేయని నగేష్
మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ విచారణ మొదటిరోజు ముగిసింది. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు అతని నుండి మౌనమే సమాధానంగా వచ్చింది. ఏమాత్రం కూడా అధికారులకు సహకరించలేదని సమాచారం. అయితే లంచం తీసుకున్న పూర్తి మొత్తంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా కస్టడిలో భాగంగా ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. అనంతరం ఆర్డీవో అరుణా రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులు నాలుగు రోజుల పాటు ఏసీబీ ఆధీనంలోనే ఉండనున్నారు. మొదటిరోజు విచారణలో ఏసీబీకి నిందితులు సహకరించలేదు. బ్యాంక్ లాకర్ పై నగేష్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 40 లక్షలు ఎక్కడ అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను, సాక్షులను సైతం అధికారులు విచారించనున్నారు. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే.