కొవిప్రోను ఆవిష్కరించిన బృహస్పతి టెక్నాలజీస్

కరోనా నియంత్రణ కోసం హైదరాబాద్ కు చెందిన బృహస్పతి టెక్నాలజీస్ సంస్థ కియోస్క్ ఆధారంగా పనిచేసే కొవిప్రోను ఆవిష్కరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఉపయోగించేందుకు 18 కొవిప్రో పరికరాలను తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటుచేసింది. ముఖాన్ని గుర్తించేందుకు, తక్షణం శరీర ఉష్ణోగ్రత కనిపెట్టేందుకు ఏర్పాట్లతో పాటు చేతులు శుభ్రం చేసుకోడానికి ఆటోమేటిక్ శానిటైజర్, వస్తువులను శుభ్రం చేసేందుకు యూవీ డిజిన్ఫెక్షన్ ఛాంబర్ అన్నీ ఒక్క పరికరంలోనే ఉంటాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా దీన్ని హైదరాబాద్ నగరంలోనే రూపొందించి, తయారుచేశారు. చర్లపల్లిలోని యూనిట్ లో రోజుకు 400 కియోస్క్ లు తయారుచేయగల సామర్థ్యం ఉంది.
కొవిప్రోలో ఒక మైక్రో ఎస్.డి. స్లాట్ ఉంది. అందులో డేటాను స్టోర్ చేసుకోవచ్చు, తమ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వేసుకోవచ్చు. ఇది సాధారణ 230 వోల్టుల ఏసీ విద్యుత్ వాడుకుంటుంది. 18.5 అంగుళాల ఎల్ఈడీ మానిటర్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందించవచ్చు, ప్రకటనలు కూడా చూపించుకోవచచు. కరోనా అనంతర కాలంలో దీన్ని సమాచార కియోస్క్ రూపంలోనూ వాడుకోవచ్చు.
దీని ఆవిష్కరణ గురించి బృహస్పతి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ పాపోలు రాజశేఖర్ మాట్లాడుతూ, ‘‘మన రోజువారీ జీవితాల్లో కరోనా చాలా మార్పులు తెచ్చింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం చాలా పెద్ద సమస్య. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాలలో ప్రతి ఒక్క వ్యక్తిని, వారు తెచ్చే ప్రతి వస్తువును పరీక్షించి, వాటిని శుభ్రపరచాలి. ఒక్కో పని కోసం ఒక్కో మిషన్ ఏర్పాటు చేయడం చాలా పెద్ద పని. ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం కొవిప్రో. మేం కొవిప్రోను రూ. 45 వేలకే అందుబాటులోకి తీసుకొచ్చాం. భారతదేశంలో ఎక్కడికైనా 30 రోజుల్లో పంపగలం. రాబోయే వంద రోజుల్లో 10,000 పరికరాలు అమ్మాలన్నది మా లక్ష్యం’’ అని తెలిపారు.
కొవిప్రో ఎలా పనిచేస్తుందంటే:
కొవిప్రో కియోస్క్ వద్దకు ఎవరైనా వెళ్లగానే తొలుత 8 మెగాపిక్సెల్ కెమెరాతో వారి ముఖాన్ని గుర్తిస్తుంది. మెడికల్ గ్రేడ్ టెంపరేచర్ స్కానర్ వాళ్ల శరీర ఉష్ణోగ్రతను నమోదుచేస్తుంది. ఒకవేళ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువ ఉంటే వెంటనే బీప్ శబ్దం వచ్చి, కంట్రోల్ రూంకు వాళ్ల ఫొటోతో కలిపి సమాచారం తక్షణం వెళ్తుంది. ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటే చేతులు శుభ్రం చేసుకొమ్మని సందేశం వస్తుంది. 5 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకు నుంచి 6 మి.మీ. నాజిల్ ద్వారా శానిటైజర్ పొగలా వస్తుంది. ఆ తర్వాత యూవీ డిజిన్ఫెక్షన్ ఛాంబర్ తలుపు ఆటోమేటిగ్గా తెరుచుకుంటుంది. అందులో తమ ల్యాప్ టాప్, మొబైల్, వ్యాలెట్ తదితరాలను ఉంచితే అవి శుభ్రపడతాయి. ఒక్కోవ్యక్తి ఇదంతా చేసేందుకు కేవలం 15 సెకన్ల సమయం పడుతుంది. క్లౌడ్ ఆధారిత ప్లాట్ ఫాం ఉండటంతో సందర్శకులను గుర్తించి, వెంటనే మాస్టర్ కంట్రోల్ రూంను అప్రమత్తం చేస్తూ సందేశాలు పంపేందుకు వీలుపడుతుంది.