కంగన రౌన‌త్‌తో మ‌హా స‌ర్కార్ ఏంటో తెలుసా ?

ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్‌ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్‌ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు.
శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్‌ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది.
కంగనపై ఫిర్యాదు నమోదు
ఉద్ధవ్‌పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్‌ స్టేషన్లో బుధవారం నితిన్‌ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్‌ కదమ్‌ తెలిపారు.
అది అక్రమ నిర్మాణమే
కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది.