బరోడ వ్యక్తికి కొండాపూర్ కిమ్స్‌లో అరుదైన సర్జరీ
డెక్కన్ న్యూస్: పర్మినెంట్ ఇలియోస్టమీ వద్ద ఉన్న కేన్సర్ కణితిని తొలగించేందుకు కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. హైదరాబాద్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడు చిన్నప్రేవులకు, ఉదరభాగానికి మధ్య ప్రాంతంలో కణితి ఉండటంతో కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఆయనకు ఇంతకుముందే 1986 సంవత్సరంలో ఒకసారి ఉదరభాగంలో వాపు వచ్చే బొవెల్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ ఉండటంతో.. పెద్దప్రేవులు, పురీషనాళం తొలగించేందుకు టోటల్ ప్రాక్టో కొలాస్టమీ శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయనకు పలుమార్లు ఉదరభాగం, గజ్జలు, హెర్నియాకు సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగాయి.
తాజాగా ఆయనకు శస్త్రచికిత్స చేసిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డీవీ రామకృష్ణ దీని గురించి ఇలా వివరించారు.. “కిమ్స్ కొండాపూర్ ఆసుపత్రిలో రోగిని పూర్తిగా పరీక్షించిన తర్వాత అతడికి చాలా అరుదైన కేన్సర్ ఉన్నట్లు గుర్తించాం. దాన్ని ఎడినో కార్సినోమా ఆఫ్ ఇలియోస్టమీ అంటారు. ఇంతకుముందు 2018లో నేను ఇదే వ్యక్తికి హెర్నియాకు లాపరోస్కోపిక్ పద్ధతిలో ఆపరేషన్ చేశాను. ఇలియం అంటే చిన్నప్రేవులలో చివరి భాగం. ఇంతకుముందు పెద్దప్రేవులు, పురీషనాళం తొలగించిన తర్వాత రోగి ఒక బ్యాగ్‌లోకి మలవిసర్జన చేసేలా ఇలియం అనే భాగాన్ని పైకి తీసుకొచ్చాం. అయితే, ఇలాంటి ఇలియోస్టమీ ప్రాంతంలో కణితి రావడం చాలా అరుదు. డాక్టర్ సతీష్ రావు నేతృత్వంలోని మా పాథాలజీ బృందం బయాప్సీ చేసి, ఆయనకు ఎడినోకార్సినోమా (కేన్సర్) ఉన్నట్లు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి కేవలం 39 కేసులు మాత్రమే బయటపడ్డాయి. మా ఆసుపత్రిలో ఇదే మొదటి కేసు. పెట్-సీటీ స్కాన్, ట్యూమర్ మార్కర్ల లాంటి పరీక్షల తర్వాత అతడికి ఆపరేషన్ చేశాయి. పూర్తిస్థాయి వైద్యపరీక్షలు, సరైన ప్రణాళికా రచన తర్వాతే మేం ఈ సవాలును స్వీకరించాం. ఇలాంటి కేసులలో అనుభవజ్ఞులైన వైద్యబృందం, సరైన మౌలిక సదుపాయాలు ఉండాలి” అన్నారు.
“ఈ కేసులో మొత్తం కణితి అంతటినీ తొలగించిన తర్వాత ఒక కొత్త ఇలియోస్టమీ సృష్టించి, అక్కడ ఉన్న హెర్నియా కోసం ఒక బయోలాజికల్ మెష్ పెట్టాం. ఈ ఆపరేషన్ ద్వారా మేం కణితి మొత్తాన్ని, దాని చుట్టూ ఉన్న కణజాలాలు, గ్రంధులను పూర్తిగా తొలగించాం” అని వివరించారు. కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ డీవీ రామకృష్ణ, డాక్టర్ ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని ఎనస్థీషియా బృందం కలిసి కొవిడ్ సమయంలో ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను సుసాధ్యం చేయగలిగారు.











