భుజానికి అరుదైన శస్త్రచికిత్స చేసిన కర్నూలు కిమ్స్ వైద్యులు
-వేరే చోటు నుంచి ఎముక, కండరాలు కత్తిరించి, పాడైన భాగంలో అతికింపు
- 20 ఏళ్ల యువకుడికి పునర్జన్మ
- లెటార్జెట్ ప్రొసీజర్ విధానం కర్నూలులో ఇదే తొలిసారి
డెక్కన్ న్యూస్ : ఆటలు ఆడేటప్పుడు జరిగే గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎంత తీవ్రమైన సమస్యలు వస్తాయో చెప్పలేం. వాటిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలా నాలుగైదేళ్ల క్రితం గాయపడి, ఇన్నాళ్లూ దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక చేతి కదలికలు దాదాపు పూర్తిగా కోల్పోయిన వ్యక్తికి అత్యంత అరుదైన లెటార్జెట్ ప్రొసీజర్ అనే అరుదైన శస్త్రచికిత్స చేసి, అతడికి చేతి కదలికలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు కిమ్స్ కర్నూలు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు ఈ చికిత్స పద్ధతి గురించి, కేసు గురించిన పూర్తి వివరాలను ఆయన ఇలా వెల్లడించారు.
“అనంతపురం జిల్లాకు చెందిన గోపీచంద్(20) అనే యువకుడు నాలుగైదేళ్ల క్రితం క్రికెట్ ఆడుతూ జారిపడటంతో అతని కుడి చేతి ఎముక పక్కకు జరిగింది. మాములు నొప్పే అనుకుని నిరక్ష్యం చేసిన అతను కొన్ని రోజుల వరకు వైద్యులను సంప్రదించలేదు. తర్వాత కొంత కాలానికి కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సరైన చికిత్స జరగలేదు. నాలుగైదేళ్ల పాటు ఇలాగే నిర్లక్ష్యం చేసి, క్రికెట్ ఆడటం సహా అన్ని పనులూ చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 30-40 సార్లు ఎముక పక్కకు జరిగింది. అది అతడికి చాలా బాధాకరంగా మారింది.
అనంతపురం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసే ఆ యువకుడి తల్లి.. తర్వాత అతడికి ఎంఆర్ఐ తీయించి కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి పంపారు. అతడిని పూర్తిగా పరీక్షించినప్పుడు బంతిగిన్నెకీలు కూర్చునే ప్రాంతం (గ్లెనాయిడ్ కప్) అరిగిపోయినట్లు తెలిసింది. దీనివల్ల ఏమాత్రం కదిలించినా చేతి ఎముక జారిపోతుంది. గ్లెనాయిడ్ కప్‌లో నాలుగోవంతు పూర్తిగా అరిగిపోయింది. దీంతో ఎముక జారిపోతుందన్న భయంతో కొన్నాళ్లుగా అతడు కుడిచేతిని వాడటం మానేసి కేవలం ఎడమచేత్తోనే అన్ని పనులూ చేసుకుంటున్నాడు. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత లెటార్జెట్ ప్రొసీజర్ అనే పద్ధతిలో అతడికి శస్త్రచికిత్స చేశారు. ఇది చాలా అరుదైన పద్ధతి. ఇందులో భుజంలోనే వేరే ప్రాంతం నుంచి ఎముకను, దాని చుట్టూ ఉన్న కండరాలతో కలిపి కొంత కట్ చేసి తీసుకొచ్చి, ఇక్కడ అతుకుతారు. ఈ కేసులో కొరకాయిడ్ ప్రాసెస్ ఎముకను, దాని కండరాలను తీసుకొచ్చి ఈ కప్ వద్ద కూర్చోబెట్టారు. దానివల్ల గ్లెనాయిడ్ కప్ మళ్లీ పూర్తి స్థాయిలో ఏర్పడింది. దీన్ని ఆర్మ్ స్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అతడి చేతి కదలికలు సాధారణ స్థాయికి రావడంతో డిసెంబరు 24న డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపేశారు. మధ్యమధ్యలో మళ్లీ ఫాల్ అప్ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు పరీక్షించగా చెయ్యి బాగుందని తేలింది. దాంతో ఇప్పుడు అతడు మళ్లీ క్రికెట్ కూడా ఆడగలుగుతున్నాడు. ఈ తరహా చికిత్సలు చేయడం కర్నూలు ప్రాంతంలో ఇదే తొలిసారి” అని డాక్టర్ జీవీవీఎస్ రవిబాబు తెలిపారు.