కేటీఆర్ సీఎం పదవికి కూడా అర్హుడే : గుత్తా
ఏ పదవినైనా సమర్ధంగా నిర్వహించే సత్తా మంత్రి కే తారక రామారావుకు ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అయితే ఆయనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు ఎప్పుడూ అన్యాయం జరుగనివ్వరని.. వారికి అవకాశాలిచ్చేందుకే మొగ్గుచూపుతూ ఉంటారని అన్నారు. రాజకీయ సమీకరణాలు, రాజకీయ పునరేకీకరణ, పార్టీ బలోపేతం దృష్ట్యా ఇతర పార్టీల నుంచి కొంతమందిని చేర్చుకోవడం అనివార్యమని.. రాజకీయాల్లో ఇది సహజమని చెప్పారు. కరోనా నేపథ్యంలో శాసనమండలి సమావేశాలకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సభ్యులు భౌతికదూరం పాటించేలా అదనంగా సీట్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 వరకు సమావేశాలు జరుగవచ్చని చెప్పారు. నాలుగు అంశాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీచేసిందని, వీటిని సభల్లో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపారు.