ఏపీలో మందు తాగితే మూడేళ్లలో మరణించే ప్రమాదం : వైకాపా రఘురామరాజు
వైకాపా ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన మద్యం బ్రాండ్లు ఉన్నాయన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. తయారయ్యే మద్యం తాగితే రెండు, మూడేళ్లలో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకే కంపెనీలో తయారవుతున్న ఈ మద్యం బ్రాండ్లు ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే అవకాశం ఉందని.. ఏపీలోతయారయ్యే మద్యం తాగితే చాలా ప్రమాదమని హెచ్చరించారు. మద్యనిషేధం పేరుతో ఎక్కడాలేని బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మడం సరికాదన్నారు. రాష్ట్రంలో దొరికే ఊరు, పేరు లేని బ్రాండ్లను తాగడం మానేయాలని ఎంపీ అందరికీ సూచించారు. మంచి బ్రాండ్ ఒక్కటి కూడా ఏపీలో ఎందుకు అమ్ముడు పోవడం లేదో ఇప్పటికైనా సీఎం తెలుసుకోవాలని.. ఇలాంటి నాసిరకం బ్రాండ్లు తాగడంవల్ల లివర్ చెడిపోయి, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఏపీలో ప్రస్తుతం అమ్ముతున్న విచిత్రమైన పేర్లతో మద్యం ఎలా, ఎక్కడ నుంచి వస్తుందో, వాటి ఉత్పత్తి, అమ్మకం ధరలను ఎవరు నిర్ణయిస్తున్నారో అర్థం కావడంలేదు అన్నారు.
ఈ మాయదారి బ్రాండ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలియదని.. అసలు, దేశంలో ఎక్కడాలేని బ్రాండ్లు రాష్ట్రంలో ఎలా లభ్యం అవుతున్నాయని ప్రశ్నించారు. బ్రాండ్ల విషయంలో విచారణ జరిపించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. మద్యనిషేధం ప్రభుత్వ విధానమైనప్పుడు దాన్ని పూర్తిగా నిషేధించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను విచిత్రమైన పేర్లతో ప్రజలకు అమ్మి, వారిని అనారోగ్యంపాలు చేయొద్దన్నారు.