ఊపిరి పోసిన కిమ్స్ వైద్యులు
- కోల్‌కతాలో బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీకరించబడిన రోగి
- సోమవారం ఉదయమే విమానంలో వచ్చిన ఊపిరితిత్తులు
- రెండు నగరాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు
- జీవన్‌దాన్, రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (రోటో) సమన్వయ కృషి
కోల్‌కతా నగరంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువకుడి ఊపిరితిత్తులు సోమవారం తెల్లవారుజామునే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం పూర్తిగా ఆక్సిజన్ మీదే ఆధారపడిన చండీగఢ్ నగరవాసి ఒకరు కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఈ ఊపిరితిత్తులు సరికొత్త ఊపిరిని అందించాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర జీవన్‌దాన్ ఫౌండేషన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (రోటో) పూర్తి సమన్వయంతో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాయి. పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసు విభాగాలు ఆసుపత్రి నుంచి విమానాశ్రయం వరకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటుచేయడం ద్వారా రవాణాలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడగలిగాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులు తీయడం, ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి అవయవాలు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రంలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. అక్కడి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ కోల్‌కతా (ఐఎన్‌కే)లో చికిత్స పొందుతున్న ఓ యువకుడిని శనివారం బ్రెయిన్‌డెడ్‌గా
ప్రకటించారు. అతడి బంధువులు అవయవదానానికి ముందుకు రావడంతో ఈ విషయాన్నిరోటోకు తెలియజేశారు. అప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి ఊపిరితిత్తులు అవసరమని తెలంగాణ జీవన్‌దాన్ ఫౌండేషన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అవయవదాన సమన్వయ సంస్థలకు తెలియజేయడంతో.. ఊపిరితిత్తులను ఇక్కడకు పంపాలని నిర్ణయించారు. ఈ విషయంలో రోటో తూర్పుజోన్ డైరెక్టర్ డాక్టర్ మణిమయ్ బందోపాధ్యాయ, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్పితా రాయ్‌చౌధురి కూడా ఎంతో సాయం చేశారు. దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల దాతల కోసం పలు చోట్ల వేచి ఉన్నా, అందులోంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోడానికి వారు తోడ్పాటు అందించారు. కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌లో గత 10 రోజుల్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేయడం వరుసగా ఇది రెండోసారి.
మనిషి శరీరంలో మార్చగల అవయవాలలో ఊపిరితిత్తులు చాలా సున్నితమైన కణజాలాలు. ఎందుకంటే, అవి వాతావరణ ప్రభావంతో త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. తీవ్రంగా గాయపడి, మెదడు తీవ్రంగా పాడైన వ్యక్తులకు చికిత్స చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందుకు పూర్తిస్థాయి నిబద్ధత, అంకితభావం కలిగిన నిపుణులు అవసరం. ఇంత అంకితభావంతో సేవలు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ వైద్యబృందాన్ని తప్పక అభినందించాలి. వారి కృషివల్లే ఈ అవయవదానం సాధ్యమైంది. అక్కడి వైద్య బృందంలో ఉన్నవారు వీరే..
డాక్టర్ మొహులా గోల్డర్ (మెడికల్ సూపరింటెండెంట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్)
డాక్టర్ ఇంద్రనీల్ (కన్సల్టెంట్ ఇంటెన్సివిస్టు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్)
డాక్టర్ తన్మొయ్ (కన్సల్టెంట్ ఇంటెన్సివిస్టు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్)
మొదటి రోగి పరిస్థితి ఇదీ..
కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఆగస్టు 16వ తేదీన పుణె నుంచి వచ్చిన ఊపిరితిత్తులతో విజయవంతంగా మార్పిడి చికిత్స చేయించుకున్న రోగి ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ మద్దతు అవసరం లేకపోవడంతో దాన్ని తీసేశారు. ఆయన తనంతట తానుగా ఊపిరి పీల్చుకుంటున్నారని,
చిన్నపాటి వ్యాయామాలు కూడా చేస్తున్నారని కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. అతి త్వరలోనే ఆయనను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి కూడా పంపేసే అవకాశం ఉందని చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి కోరలు చాచిన ఈ సమయంలో ఇంతటి సంక్లిష్టమైన అవయవమార్పిడి శస్త్రచికిత్సలు కూడా విజయవంతంగా చేయడం ముదావహం.