పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది?

సినిమా – రాజకీయం… ఈ రెండు రంగాలూ చాలా దశాబ్దాలుగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. గతంలో సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. అన్నయ్య చిరంజీవి బాటలోనే 1996లో సినీ రంగంలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్, ఆ తరువాత కూడా ఆయన మార్గంలోనే 2014లో రాజకీయాల్లోనూ రంగ ప్రవేశం చేశారు. సినీరంగంలో అనతి కాలంలోనే సూపర్‌స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న పవన్ కల్యాణ్, రాజకీయాల్లోనూ ముందుకుసాగుతున్నారు. ‘ఎంత సుధీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను’ అంటారాయన.

2014 మార్చి 14న జనసేన పార్టీని నెలకొల్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ, ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌ రహిత దేశాన్ని చూడటమే లక్ష్యమని చెప్పిన పవన్ కల్యాణ్ అప్పుడు ‘కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో’ నినాదాన్ని అందుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ రెండు పార్టీల తరఫున ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత పవన్ కల్యాణ్ ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్‌పైనే దృష్టి పెట్టారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలు, డ్రెడ్జింగ్ కార్పరేషన్ ప్రైవేటీకరణ లాంటి అంశాలపై జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.మూడేళ్లకు పైగా టీడీపీ పక్షాన నిలబడిన పవన్ కల్యాణ్, 2018లో యూ టర్న్ తీసుకున్నారు. ఓ బహిరంగ సభలో టీడీపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన, ఆ రోజు నుంచీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవడంలో టీడీపీ విఫలమైందన్న ఆయన తన ప్రచారం వల్లే 2014లో టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌లో గెలిచిందని పేర్కొన్నారు. టీడీపీతో పాటు బీజేపీకి కూడా దూరమైన జనసేన పార్టీ, కమ్యూనిస్టులకు చేరువైంది.

2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ 2019లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించారు.

వ్యక్తిగతం

పవన్ కల్యాణ్‌ సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. ఇంటర్‌ చదివే రోజుల్లోనే తనపైన ‘చిరంజీవి తమ్ముడు’ అన్న ముద్రపడిపోయిందని చెబుతారు. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి సినిమాల్లో సూపర్ స్టార్‌గా ఎదిగి తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పారు. ఆ తరువాత మూడేళ్లకే ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. గతంలో సినీరంగంతో సంబంధంలేని మహిళను పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్, రెండో వివాహంగా నటి రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చిన అనంతరం, అన్నా లెజ్‌నేవా అనే రష్యన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు.