తెలంగాణలో కనిపించే పాములు
వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు అవాసాలుగా మారుతాయి. నీటి నిల్వ గుంతలు, చెట్ల పొదలు మన ఇళ్ల చుట్టూ ఉండటం వలన పురుగులు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా చేరుతుంటాయి. ఇక ఇవి ఉన్నచోటికి సర్వ సాధారణంగా పాములు వస్తుంటాయి. అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇంటి చుట్టూ వర్షాల కారణంగా పెరిగిన మొక్కలను గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఎండకాలం పరిసరాలు శుభ్రంగానే ఉంటాయి. గడ్డి, పిచ్చి మొక్కలు పెరగటానికి ఆ స్కారం ఉండదు. జూలైమాసం నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కావడంతో వర్షాలు ఎక్కువగా పడి నీరు నిల్వ ఉండటం, దాని మూలంగా పిచ్చిచెట్లు, ఇతర మొక్కలు విపరీతంగా పెరిగి పరిసరాలు మొత్తం కమ్ముకుంటాయి.
మొదట పాము కాటును గుర్తించడం ఎలా..?
పాము కాటు శరీరంపై పడిందో లేదో తెలుసు కోవటానికి ముందుగా ఏ ప్రాంతంలో కాటువేసింది, నేరుగా శరీరం పై కాటు వేసిందా, వస్ర్తాలపై నుంచి కాటు వేసిందా లేదా అనేది ముందుగా పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతేకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లుగా, రెండుచోట్ల మాత్రమే కోరల కాట్లు, రక్తపు చుక్కలు కన్పిస్తాయి. పాము కరిచిన వెంటనే ప్రథమ చికిత్స.. పాము కాటు వేయగానే మొదట గుర్తించడం అవసరం. నిద్రలో పాము కాటేస్తే కొందరు గుర్తించ లేక చనిపొతున్నారు.కొందరు మద్యం మత్తులో ఉండి పాము కాటు గుర్తించలేని పరిస్థితిలో మరణిస్తున్నారు. పాము కరిచినట్లు గుర్తించిన వెంటనే నిమిషాల వ్యవధిలో అప్రమత్తం అవ్వాలి. విషం రక్తంలో కలిసి గుండెకు చేరితే ప్రాణప్రాయం సంభవించినట్లే లెక్కా. పాము కాటుకు గురైన వ్యక్తి నడవటం, పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
జాగ్రత్తలు అవసరం..
రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేటప్పుడు మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను వేసుకొని వెళ్లడం మంచిది. పాములు కేవలం శబ్ద తరంగాలను గ్రహించి అప్రమత్తమవుతాయి. అందువల్ల శబ్దం చేసేలా అడుగులు వేయడం, ఏదోలా చప్పుడు చేయడం వల్ల వాటిని గ్రహించి పాములు అప్రమత్తమై పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకొని వెళ్లడం మంచిది. రాత్రిపూట పొలానికి వెళ్లాల్సి వస్తే టార్చిలైటు, కర్ర తీసుకెళ్లడం తప్పనిసరి.
కొన్ని మందులు పాముకాట్ల నుంచి తప్పించుకొనే పద్ధతులు తెలియడం కూడా అవసరమే. ఇళ్లలో ఉండే పసరు మందులు, నాటు వైద్యులు ఇచ్చే ఆకులు, అలములను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. ఏది కరచినా తక్షణం వైద్య సేవలు పొందడం అనివార్యమని గుర్తుంచుకోవాలి. ఆ సమయం అర్ధరాత్రయినా, పగలైనా సరే.. ఆస్పత్రిలో చేరిన తర్వాత మరణించినవారు చాలా అరుదు. పాముకాటుకు మొదట బాధ్యత వహించాల్సింది మనమే. వాటికి మనం ఏదైనా అపాయం తలపెడతామోనన్న భయంతోనే అవి కాటేస్తుంటాయి. వాటిని పొరపాటున కాలితో తొక్కేయడమో లేక గడ్డి కోస్తున్నపుడు వాటిని పట్టుకోవడమో, తాకడమో చేయడంతోనే అవి కాటేస్తున్నాయని గుర్తించాలి. పాముకాటుకు గురైన వ్యక్తిలో కన్పించే లక్షణాలు… విష సర్పాలు వేర్వేరుగా ఉన్నట్లే వాటి కాటు వలన బాధితుల్లో కన్పించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిమాణం బట్టి కూడా ప్రమాద స్థాయి ఉంటుంది. సాధారణ తాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లతాచు విష ప్రభావం చాలా త్వరగా కన్పించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్ల పాము కాటు బాధ ఒక రకమైతే రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి.
అనుకోని పరిస్థితుల్లో పాము కాటు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడవద్దు. కాస్త సమయస్ఫూర్తి ప్రదర్శించి వైద్య సహాయం పొందితే ప్రాణాలు కాపాడుకోవచ్చు.