చిన్నగాయమే కదా అని తీసి పారేయొద్దు
- ఆటల్లో అయ్యే గాయాలకు శస్త్రచికిత్సలూ అవసరమే
- కొత్త టెక్నిక్ తో చీలమండ గాయం సరిచేసిన కిమ్స్ వైద్యులు
కాస్త మధ్యవయసు వచ్చినప్పటి నుంచి ఫిట్ నెస్ మీద, వ్యాయామం మీద ఎక్కువ మందికి మోజు పుడుతుంది. 25-40 ఏళ్ల మధ్యవారిలో ఈ తరహా ఆసక్తి ఎక్కువ. ఆటలు ఆడటం, ఈత కొట్టడం, జిమ్ చేయడం లాంటివాటిపై దృష్టిపెడతారు. అయితే ఇలా ఆటలు ఆడుతున్నా.. వ్యాయామాలు చేస్తున్నా చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి. చిన్నదే కదాని వాటిని తీసిపారేస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లుగా అది చాలా ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా ఇలాంటి కేసే ఒకటి హైదరాబాద్ నగరంలో వచ్చింది. దానికి కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్యులు సరికొత్త విధానంలో చికిత్స చేశారు.
మనం నడవాలన్నా, పరుగెత్తాలన్నా, మరేపని చేయాలన్నా కాలిలో చీలమండ, పాదం, మోకాలు చాలా ముఖ్యం. ఈ భాగాల్లో అయ్యే గాయాలు తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. మహేందర్ (పేరు మార్చాం) చిన్న వ్యాపారం చేస్తూ సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. సుమారు 6 నెలల క్రితం ఇలా ఆడేటప్పుడు ఎడమ కాలు బెణికింది. దాంతో చీలమండ దగ్గర నొప్పి వచ్చింది. అయితే పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత నొప్పి పెరగడంతో మాత్రలు వేసుకుని వేడి, చల్లనీళ్లతో కాపడం పెట్టుకున్నారు. బూట్లు సరిగా లేవని అవి కూడా మార్చారు. అయినా తగ్గకపోగా, రోజూ సాయంత్రానికి బాగా పెరిగేది. స్థానిక వైద్యుడి వద్దకు వెళ్తే ఎక్స్ రే తీసి స్నాయువు (లిగమెంట్) గాయం ఉందని భావించి కట్టు కట్టారు. కానీ దాంతో నొప్పి మరింత పెరిగింది. మరో డాక్టర్ వద్దకు వెళ్తే ఆయన ఆయింట్ మెంట్, కాల్షియం మాత్రలు, విటమిన్ డి ఇచ్చి విశ్రాంతి తీసుకొమ్మన్నారు. నొప్పి భరించలేక మహేందర్ తనకు ఎంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ కూడా వదిలేశారు. దాంతో బరువు పెరడంతో పాటు చీలమండ వాచింది. అప్పుడు స్నేహితుల సూచనతో కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.
వెంటనే చీలమండకు ఎంఆర్ఐ చేయించగా మృదులాస్థి 18 x 20 మి.మీ. మేర దెబ్బతిందని గుర్తించారు. బరువును మోసే ప్రాంతంలో ఈ గాయం ఉంది. అదే ఈ నొప్పికి కారణం. కానీ గాయం ఎప్పుడైందో కూడా ఆయనకు గుర్తులేదు. పదే పదే ప్రశ్నించగా అప్పుడు కాలు బెణికిన విషయం చెప్పారు. ఇలాంటి లోపాలను గుర్తించడం అంత సులభం కాదు. దానికి చాలా నైపుణ్యం, అనుభవం అవసరం. మామూలుగా అయితే ఇలాంటి సమస్యలకు రెండుసార్లు శస్త్రచికిత్స చేస్తారు. అయినా 100% నయమవుతుందని చెప్పలేరు.
కానీ ఆల్ ఆటోలోగస్ కార్టిలేజ్ రిపేర్ (ఏసీసీఆర్) అనే సరికొత్త చికిత్స పద్ధతిలో కొండాపూర్ కిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ సీఆర్ సురేష్ బాబు, అన్నే సాయి లక్ష్మణ్, డాక్టర్ అజయ్ కుమార్ పరుచూరి ఆయనకు నయం చేశారు. ఇందులో రోగి శరీరంలోని ఆరోగ్యవంతమైన మృదులాస్థి చిప్స్ సేకరించి, వాటిని అంటు కడతారు. దానికి ప్లేట్ లెట్లు బాగా ఉన్న ప్లాస్మాను కూడా కలిపి.. గాయమైన చోట చిన్న రంధ్రం చేసి అందులో నింపుతారు. ఇందులో కృత్రిమ పదార్థాలు గానీ, బయటివి గానీ ఏవీ లేకపోవడంతో రోగి శరీరం వాటిని తిరస్కరించదు. పైగా శస్త్రచికిత్స కూడా ఒక్కసారి చేస్తే చాలు. ఇలా చేయడం దక్షిణ భారతదేశంలోనే తొలిసారి. దీని తర్వాత మహేందర్ మూడు వారాల విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత కొద్దిగా బరువు మోపడం అలవాటు చేశారు. ఇక ఆరు నెలల కాలంలో అతడి నొప్పి, వాపు అన్నీ పూర్తిగా తగ్గి.. ఎప్పుడెప్పుడు బ్యాడ్మింటన్ ఆడతానా అని ఉత్సాహంగా ఉన్నారు.
ఈ తరహా గాయాల గురించి కిమ్స్ వైద్య నిపుణులు ఇలా వివరించారు. ‘‘సాధారణంగా 25-40 ఏళ్ల మధ్యవారికి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఆటలు ఆడేవారికి ఎక్కువగా మోకాలు, చీలమండ వద్ద గాయాలు అవుతాయి. ఈ వయసులో దానంతట అదే చాలావరకు నయమవుతుంది కూడా. కానీ కొన్ని సందర్భాల్లో అది బాగా తీవ్రమై శస్త్రచికిత్స అవసరమవుతుంది. అది కూడా 50 ఏళ్లలోపు అయితేనే చేయగలం. ఆ తర్వాత కీళ్లవాతం మొదలైతే ఇలాంటివి అంత ఫలితాన్నివ్వవు. ఆటలు ఆడేటప్పుడు ముందుగా తగినంత వార్మప్ చేయకపోవడం, సరైన బూట్లు వేసుకోకపోవడం వల్ల కూడా గాయాలవుతాయి. చిన్న నొప్పి రాగానే స్ప్రే చేసుకుని, నీ క్యాప్ వేసుకుని ఆడేస్తారు. కానీ ఇలా చిన్న నొప్పి రాగానే ఎముకల వైద్య నిపుణుల వద్దకు వెళ్లి, తగినంత విశ్రాంతి, చికిత్స తీసుకోవాలి. గాయం పెద్దదైతే శస్త్ర చికిత్స అవసరం అవుతుంది. నెలకు మాకు ఇలాంటివి 4-5 కేసులు వస్తుంటాయి’’ అని తెలిపారు.
శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం ముఖ్యమే.. అదే సమయంలో గాయాలు కాకుండా చూసుకోవడమూ అవసరమే. చిన్న గాయం పెద్దదై సంక్లిష్టంగా మారేవరకు ఆగకుండా వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిది.