జిమ్‌ల‌కు అనుమ‌తినిచ్చిన కేంద్రం

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్‌ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్‌ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అయితే కంటైన్మెంట్‌ జోన్లలోని యోగా ఇనిస్టిట్యూట్‌లు, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేకాక స్పాలు, స్మిమ్మింగ్‌ ఫూల్‌లు తెరవడానికి కూడా అనుమతిలేదు. జిమ్‌లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
అవి

  1. 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు మూసివేసిన ప్రదేశాలలోని జిమ్‌లను ఉపయోగించవద్దని కోరింది.
  2. జిమ్‌ సెంటర్లలో అన్ని వేళలా ఫేస్ కవర్, మాస్క్‌ తప్పనిసరి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, మాస్క్‌ వాడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక విజర్ మాత్రమే ఉపయోగించవచ్చు.
  3. ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరి.
  4. యోగా సెంటర్‌, జిమ్‌లో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాలను ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. సాధ్యమైతే వాటిని ఆరుబయట ఉంచాలి.
  5. గోడలపై సరైన గుర్తులతో భవనంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేయాలి.
  6. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కోసం, ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచాలి. వీలైనంతవరకు తాజా గాలిని తీసుకోవాలి.
    ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిమ్‌, యోగా సెంటర్‌ గేట్లలో శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరిల. సిబ్బందితో సహా కరోనా లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే జిమ్‌లోనికి అనుమతించబడతారు.