మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలి – చంద్రబాబు
దిల్లీ: ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నోట్ల రద్దుతో ప్రజలంతా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. ‘‘1972 తర్వాత దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. మోదీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు… ఆందోళనకు దిగారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడుందని మోదీని సూటిగా శ్నిస్తున్నా. ప్రధానికి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు. మేమంతా ఎక్కడ చదువుకున్నామో చెప్పగలం.. మోదీ చెప్పగలరా? రఫేల్ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయి. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలి.. త్వరలోనే కుర్చీ దిగుతారు. దేశంలో విపక్ష నేతల చరవాణులను ట్యాప్ చేస్తున్నారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేశారు. కేజ్రీవాల్ తన పరిపాలనలో దిల్లీలో అద్భుతాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ను సైతం అడ్డుకున్నారు.. ఎందుకో చెప్పాలి? మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం. అందరు విపక్ష నేతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. భాజపా నేతలపై మాత్రం ఒక్క దాడి జరగలేదు. మోదీ అప్రజా స్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే మేమంతా ఏకమయ్యాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.