మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి
టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీనును హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మదనపల్లె ఓంప్రకాశ్ ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని కేజీహెచ్‌లో మృతి చెందాడు. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్.. శనివారం రాత్రి అనారోగ్య సమస్య రావడంతో విశాఖ సెంట్రల్ జైలు అధికారులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్య, జైలు అధికారులు ప్రకటించారు.
-ఓంప్రకాశ్ మదనపల్లెకు చెందిన వ్యక్తి. 2001లో ఓ లారీని చోరీ చేసి అడ్డొచ్చిన డ్రైవర్‌ను హత్య చేశాడు.
-ఈ కేసులో పుంగనూరు పోలీసులు ఓంప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది.
-అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓంప్రకాశ్ 2008 నవంబర్ 9న పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దుశీనును జైల్లోనే డంబెల్‌తో కొట్టి హత్యచేసి వార్తల్లోకెక్కాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవితఖైదు విధించింది. విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.