రామ్ గోపాల్ వర్మ ఆఫీస్‌పై పవన్ ఫ్యాన్స్ దాడి
మొత్తానికి వర్మ ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఉంది.. నిన్న టీవీ ఛానల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి.. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నా కంపెనీ అంటూ బహిరంగ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే గురువారం నాడు రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రామ్ గోపాల్ వర్మ కార్యాలయానికి ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. కొంతమంది అభిమానులు ఏకంగా రాళ్లతోని కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడిలో రామ్ గోపాల్ వర్మ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అయింది. మొత్తం ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వర్మని బయటకు రావాలని కేకలు వేశారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారందరూ పవన్ కళ్యాణ్ అభిమానులుగా అధికారులు తేల్చారు. అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల పైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ‘పవర్ స్టార్’ అనే లఘు చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్‌ను నిన్న (జూలై 22) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు వర్మ. అయితే ఇందులో పవన్ కళ్యాణ్‌ని కించపరుస్తూ ఆయన పొలిటికల్, పర్సనల్ లైఫ్‌ను దారుణంగా చూపించారు. ఈ ట్రైలర్ చూసిన పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతుండగా.. వర్మకు ‘పరాన్నజీవి’ చిత్రంతో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగా అభిమాని, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు.. వర్మపై ‘పరాన్నజీవి’ అనే చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్, పాటలకు వర్మకు గట్టి కౌంటర్ ఇవ్వగా.. ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు (జూలై 23) రాత్రి 7 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి మొన్నటి వరకూ వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్‌గా ఉన్న వ్యవహారం.. ఇప్పుడు ‘పవర్ స్టార్ వర్సెస్ పరాన్నజీవిగా మారింది.