గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకులు
రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలుంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటాలో మండలికి ఎన్నిౖకైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయ న పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగి సింది. గతంలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 19న ముగిసింది. మండలిలో ప్రభుత్వవిప్ కర్నె ప్రభాకర్ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 17న ముగియనుంది. దీంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని పలువురు నేతలు పావులు కదుపుతున్నారు.
గవర్నర్ కోటాలో ఒకేసారి మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహుల జాబితా కూడా పెరుగుతోంది. సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు, నాయిని తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు రెండోవారంలో రాష్ట్ర కేబినెట్‌లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశం ఉంది.