వైద్య నారాయణులకు ఆపన్న హస్తం
సాయం చేసే చేతుల కోసం అన్ని వర్గాలూ ఎదురుచూస్తున్నాయి. ప్రతి చోటా సాయానికి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆందోళనగానే ఉన్నారు. ఇది కష్టకాలం. అత్యంత సంక్లిష్టంగా పరిస్థితులున్న ఈ సమయంలో తమతో పాటు తమ కుటుంబాన్నీ రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు నిస్వార్థంగా ఇతరుల క్షేమం కోసం కృషిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది కరోనాపై పోరాటంలో ముందుండి తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. గాంధీ ఆసుపత్రి సిబ్బంది విషయంలో ఇది మరింత కఠోర వాస్తవం. చాలామంది కరోనా రోగులు వైద్యమో రామచంద్రా అంటూ గాంధీకే వస్తున్నారు. అందువల్ల ఇక్కడి వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించే పరికరాల అవసరం చాలా తీవ్రస్థాయిలో ఉంది. ఈ విషయాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. వారి ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ఒక అడుగు ముందుకు వేసింది.
ఉస్మానియా వైద్యకళాశాల 1996 పూర్వవిద్యార్థుల సంఘం ఆస్మెకో.. కొవిడ్ 19 బాధితుల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చింది. మిట్టా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రోగులతో పాటు.. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అవసరాలు తెలుసుకోడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసింది. కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న ఈ తరుణంలో వారి రక్షణకు నడుం కట్టింది. వారందరినీ ఆదుకుంటామంటూ ముందుకొచ్చింది. కొందరు స్నేహితులు, సహోద్యోగుల నుంచి అందిన విరాళాల సాయంతో తాము చేయగల కొద్దిపాటి సాయం చేయాలని నిర్ణయించింది. “చిన్నచిన్న నీటి బిందువులే సింధువు అవుతాయి” అన్న నానుడి ఉంది. అదే విధంగా రోగులు, వైద్యులు, వైద్యసిబ్బంది అందరిలో ఉన్న ఆందోళనను తొలగించడానికి కొద్దిపాటి సాయమైనా చేయాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయంలో తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన మిట్టల్ ఫౌండేషన్‌తో పాటు, ఈ బృహత్తర యజ్ఞంలో పాలు పంచుకోడానికి ముందుకొచ్చిన పలువురు స్నేహితులకూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల కోసం 10 రీయూజబుల్ డ్యూపాంట్ పీపీఈ కిట్లు, 20 డిజిటల్ ఆక్సీమీటర్లు, 2 ఆటోమేటిక్ శానిటైజర్లు తొలి విడతగా అందిస్తున్నారు. వీటన్నింటి విలువ లక్ష రూపాయలు. రెండో విడతలో ఉస్మానియా ఆసుపత్రి, ఇతర ప్రభుత్వాసుపత్రులలో వైద్యులకు ఇలాంటి పరికరాలే అందుతాయి. మొత్తం 5 లక్షల రూపాయల విలువైన సామగ్రి అందించాలని నిర్ణయించారు. వీటిలో పీపీఈ కిట్లు, డిజిటల్ ఆక్సీమీటర్లు, ఆటోమేటిక్ శానిటైజర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ డి. శేషాద్రి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శోభన్ బాబు, రెసిడెంట్ డాక్టర్ మరియు టి-జూడా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఖైజర్ హుస్సేన్ జునైదీ, న్యూరో సర్జరీ రెసిడెంట్, టి-జూడాకు చెందిన డాక్టర్ నాగార్జున, మిట్టా ఫౌండేషన్‌కు చెందిన వినోద్ కుమార్ మిట్టా, ఆస్మెకో 66 అలుమినీకి చెందిన డాక్టర్ భారతి, డాక్టర్ ఎ.వై. చారి తదితరులు పాల్గొన్నారు.