మొక్క‌లు నాటిన ఎమ్మెల్యే రజిని


ఒక చెట్టును మ‌నం కాపాడితే ప‌ది మంది మ‌నుషుల ప్రాణాల‌ను మ‌నం కాపాడిన‌ట్లేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ‌వాసుల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప‌సుమ‌ర్రుల్లోని స్థ‌లాల్లో ఎమ్మెల్యే గారు బుధ‌వారం మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్క‌ల‌ను సంర‌క్షిస్తే మ‌నం ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించుకున్న‌ట్లేన‌ని తెలిపారు. ఎవ‌రైనా మొక్క‌ను న‌రకడ‌మంటే మ‌నిషిని చంపడంతో స‌మాన‌మ‌ని చెప్పారు. ఒక వృక్షాన్ని మ‌నం బాగా పెంచ‌గ‌లిగితే ఏడాదికి 30 కిలో లీట‌ర్ల కార్బ‌న్‌డై ఆక్సైడ్‌ను వాతావ‌రణం నుంచి తొల‌గిస్తుంద‌ని చెప్పారు. సాధ్యమైన‌న్ని ఎక్కువ మొక్క‌ల‌ను పెంచ‌డ‌మే ప్ర‌తి ఒక్క‌రి ల‌క్ష్యం కావాల‌ని తెలిపారు. మొక్క‌లను పెంచాలి- వాటి ఫ‌లాల‌ను ఆస్వాదించాలి… అనే సంక‌ల్పంతో అంద‌రం ముందుకు సాగాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీనివాస‌రావు గారు, అధికారులు పాల్గొన్నారు.