లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌ విధించినట్లు తెలిపారు. ఈమేరకు బెంగళూరులోని ఎనిమిది జోన్ల ఇన్‌చార్జి మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ… ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి.. కోవిడ్, నాన్‌–కోవిడ్, హోం క్వారంటైన్‌ విషయాల గురించి చర్చించాలని మంత్రులకు సూచించారు. లక్షణాలు కనిపించని రోగులను ఇంట్లోనే క్వారంటైన్‌ ఉండేలా చూడాలన్నారు. అంతేకాకుండా మృతదేహాలకు కోవిడ్‌ పరీక్షల అనంతరం నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. ఇళ్లలోనే మృతి చెందిన వారికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేసి అంత్యక్రియలు త్వరగా చేస్తే బాగుంటుందని తెలిపారు.