నేటి నుండి 4 జిల్లాల్లో పూర్తి లౌక్‌డౌన్
రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ వైపు చూస్తున్నాయి. కొత్తగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, సిటీల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గోవా సహా పలు రాష్ట్రాలు ఇదే స్ట్రాటజీని అమలు చేస్తుండగా.. తాజాగా ఒడిశా సర్కారు అదే బాటలో నిర్ణయం తీసుకుంది. నాలుగు జిల్లాలతో పాటు ఒక సిటీలో 14 రోజులు పాటు పూర్తి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఒడిశా చీఫ్ సెక్రెటరీ అసిత్ త్రిపాఠీ. గంజాం, ఖోర్ధా, కటక్, జాజ్పూర్ జిల్లాలతో పాటు రూర్కెలా నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ జూలై 17 రాత్రి 9 గంటల నుంచి ఈ నెల 31 అర్ధరాత్రి వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తే మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కాగా, ఒడిశాలో ఇప్పటి వరకు 14,898 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 77 మంది మరణించగా.. 10,476 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4,345 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.