ఇక షురు కానున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు
కరోనా వైరస్ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాలతో చర్చలు జరిపామని చెప్పారు. శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్ నుంచి భారత్‌కు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. జులై 17 నుంచి జులై 31 వరకూ భారత్ అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాలు నడుస్తాయని వెల్లడించారు. జులై 18 నుంచయి ఆగస్ట్ 1 వరకూ పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూర్ మధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాలను నడపనుందని వెల్లడించారు. జర్మనీతో కూడా విమాన సర్వీసులపై సంప్రదింపులు జరిపామని చెప్పారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కొలిక్కివచ్చిందని మంత్రి హర్ధీప్‌సింగ్ తెలిపారు. విదేశీ విమాన సర్వీసులపై ఈ నిర్ణయంలో పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆయా దేశాలతో ఒప్పందాలకు అనుగుణంగా విదేశీ విమాన సేవలను పునరుద్ధరించామని మంత్రి తెలిపారు.