భయం కరోనా కంటే ప్రమాదంగా మారింది!
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులలో ఒకటైన కాంటినెంటల్ ఆసుపత్రికి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ‘‘స్ట్రోక్’’ రోగుల కుటుంబసభ్యుల నుంచి వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్లంతా ప్రాణాలు కాపాడుకోడానికి మరణంతో పోరాడుతున్నవాళ్లే. వాళ్ల కుటుంబసభ్యులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులు ఫోన్లలోనే వైద్య సలహాలు అడుగుతున్నారు. దాంతో చాలామంది రోగులు సమయానికి తగిన వైద్యసాయం అందక మరణిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలోని న్యూరాలజీ డిపార్టుమెంట్లకు స్ట్రోక్ రోగులు వచ్చి చేరుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే వారికి ‘కరోనా వైరస్’ వ్యాపిస్తుందేమోనన్న భయం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రులలోని అసోసియేట్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ కైలాష్ మిర్చే మాట్లాడుతూ, ‘‘మా ఆసుపత్రికి తరచుగా వచ్చే రోగుల వైద్యపరమైన అవసరాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ఇక్కడి నుంచి కూడా తీరుస్తాం. కానీ, కొత్తగా ఎవరికైనా తీవ్రస్థాయిలో స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రం వాళ్లను భౌతికంగా పరిశీలించి, వాళ్ల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయకుండా కేవలం ఫోన్ ద్వారా మందులు ఇవ్వడం అనేది ప్రమాదకరం అవ్వచ్చు. అందుకే మేం వాళ్ల విషయంలో అలా చేయం. బాధితుల కుటుంబ సభ్యులు వాళ్లను వీలైనంత త్వరగా వాళ్లకు సమీపంలో ఉన్న ఆసుపత్రికి లేదా వైద్యశాలకు అత్యవసరంగా తీసుకెళ్తేనే వాళ్ల ప్రాణాలను కాపాడుకోగలం. స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల్లోగా వాళ్లకు బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ల ప్రాణాలను కాపాడవచ్చు. దానివల్ల వ్యాధి తీవ్రతతో పాటు మరణ ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు స్ట్రోక్ వచ్చిన రోగులు ఆసుపత్రులలో చేరడం ఇటీవలి కాలంగా బాగా తగ్గిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.’’ ‘‘కాంటినెంటల్ ఆసుపత్రిలో, మేం రోగుల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని, వాళ్లను వైరస్ రహిత వాతావరణంలో ఉంచి చికిత్స చేస్తాం. స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్టు లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే రోగులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకొస్తే వాళ్లను కాపాడే అవకాశం ఉంటుంది. కొవిడ్-19 అనేది తీవ్రమైన సమస్యే అయినా, సరైన సమయానికి వైద్యం అందకపోతే ఇలాంటి రోగులు వెంటనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది’’ అని కాంటినెంటల్ ఆసుపత్రుల సీఈవో డాక్టర్ రాహుల్ మేడక్కర్ తెలిపారు. అంటువ్యాధులు కానివి, కరోనాయేతర ఆరోగ్య సమస్యలలో కూడా ప్రాణాపాయం చాలా ఎక్కువ స్థాయిలో ఉందన్న విషయమై మన సమాజంలో అవగాహన రావడం చాలా అవసరం. సమయానికి వైద్య సేవలు అందకపోతే వచ్చే సమస్యలను ప్రజలు అర్థం చేసుకోవడం ముఖ్యం. అలా అర్థం చేసుకుంటేనే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడటం వీలవుతుంది.