అక్కడ 11 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇందులో 1576 మంది లోకల్స్ కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,194 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,936 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 292కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా భారీ సంఖ్యలో టెస్టులు చేస్తోంది జగన్ సర్కారు. రాష్ట్రం నలుమూలలా ప్రతి రోజూ వేల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ నాలుగు నెలల్లోనే 11 లక్షల మార్క్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 21 వేలకు పైగా టెస్టులు చేసినట్లు శుక్రవారం ఉదయం బులిటెన్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 11,15,635 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.