హైదరాబాద్‌లో సామాన్యుడి ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు
హైదరాబాద్‌లో నివసించే ఓ సామాన్యుడికి కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ప్రతి నెల వందల్లో వచ్చే బిల్లు ఏకంగా 25 లక్షల రూపాయలు రావడంతో ఆ బిల్లును చూడగానే అవాక్కయ్యాడు. తీరా ఆ బిల్లును తీసుకుని కరెంట్ ఆఫీసుకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో మీటర్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పారు అధికారులు. హైదరాబాద్‌లోని లాలాగూడ పరిధిలో నివసించే కృష్ణమూర్తి అనే సామాన్యుడి ఇంటి కరెంటు బిల్లులో ఈ పొరబాటు జరిగింది. మార్చి నుంచి ఈ నెల వరకు నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి, ఏకంగా రూ.25,11,467 బిల్లు వేశారు. పాతిక లక్షలకు పైగా వచ్చిన బిల్లును చూసి షాక్ అయిన కృష్ణమూర్తి.. స్థానిక కరెంట్ అఫీసులో పిర్యాదు చేశాడు. దీంతో అతడి ఇంటికి వెళ్లి కరెంటు మీటరును పరిశీలించారు అధికారులు. కరెంట్ మీటర్లో టెక్నికల్ ప్రాబ్లం ఉందని గమనించిన వారు.. వెంటనే మీటర్‌ను ఎర్రగడ్డలోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి సాంకేతికంగా తనిఖీ చేశారు. ఆ మీటర్‌లో ప్రాబ్లమ్ వల్లనే వినియోగదారుడికి భారీగా బిల్లు వచ్చినట్లు తేల్చారు. దీంతో ఆ మీటరు స్థానంలో కొత్త దాన్ని బిగించామని లాలాగూడ ఏడీఈ తెలిపారు. అతడి వాస్తవ బిల్లు రూ.2095గా వచ్చిందని చెప్పారు.