సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చండి : భాజపా డిమాండ్
కరోనా కేసులు పెరుగుతుండడంతో సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఆర్థిక పరిస్థితి బాలేదంటూనే ఉన్నవి కూల్చి కొత్తవి కట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, దీనిపై పునరాలోచన చేయాలన్నారు. కరోనా తగ్గాక, ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక కొత్త సచివాలయ నిర్మాణం గురించి ఆలోచన చేస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయవద్దని, ఉన్న పైసల్ని పొదుపుగా వాడాలని సీఎంకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతోందని, అందుకే ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్‌లో బెడ్స్ ఉన్నా ఎవరూ చేరడం లేదన్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చేయిదాటిపోతోందని, ఇప్పటికైనా మేల్గోకపోతే పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. రెండు నెలలపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు కట్చేసిన వేతనాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.