ప్రసవ సమయంలో కార్డియాక్ అరెస్టు.. తల్లీబిడ్డల ప్రాణాలు రక్షించిన కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు

కొవిడ్ భయంతో ఆసుపత్రులకు రాకపోవడంతో.. నివారించగల ఇతర మరణాల్లో 45% పెరుగుదల

కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళ.. 33 వారాల గర్భవతి. ఆమెకు ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్టు కావడంతో హుటాహుటిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీకి తరలించారు. ఆమెకు రక్తపోటు, కాలేయ ఎంజైములలో సమస్య, ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆమె ప్రాణాలు, బిడ్డ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఆ రోగి బీదర్ నుంచి కాంటినెంటల్ ఆసుపత్రులకు 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. అత్యవసరగదిలో ఆమెకు వెంటనే ఎండోట్రాకియల్ ఇంట్యూబేషన్ ద్వారా శ్వాస అందించి రీససికేషన్ ప్రక్రియ నిర్వహించారు. నెలలు నిండని బిడ్డను బయటకు తీసేందుకు అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ప్రసవం తర్వాత తల్లికి మరోసారి కార్డియాక్ అరెస్టు అయ్యింది. ఎమర్జెన్సీ వైద్యులు, ఇంటెన్సివిస్టులు, గైనకాలజిస్టులు, మత్తువైద్య నిపుణులు వెంటనే ఆమెకు చికిత్స చేసి, అత్యుత్తమ వైద్యం అందించారు. నిరంతరం పరిశీలిస్తూ చికిత్స చేయడంతో తల్లీబిడ్డలిద్దరూ కోలుకుని, క్షేమంగా ఉన్నారు. దాంతో వారిని డిశ్ఛార్జి చేశారు. ఈ పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రుల సీనియర్ కన్సల్టెంట్, అత్యవసర, ట్రామా సర్వీసుల విభాగాధిపతి డాక్టర్ పాటిబండ్ల శ్రీసౌజన్య మాట్లాడుతూ, ‘‘కొవిడ్-19 భయం వల్ల అత్యవసర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలామంది వైద్యుల వద్దకు, ఆసుపత్రులకు రావడం లేదు. ఇలా భయంతో కూడిన నిర్లక్ష్యం వల్ల సమస్య మరింత పెద్దదై, చివరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా కొవిడ్ కాకుండా.. నివారించదగిన మరణాలు హైదరాబాద్ ఆసుపత్రులలోనే ఏప్రిల్, మే నెలల్లో 45% పెరిగినట్లు సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. వీళ్లను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఆ ప్రాణాలను కాపాడగలిగే వాళ్లం.’’ ‘‘దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించేందుకు అత్యవసర వైద్యసేవలు, ఆసుపత్రులు పనిచేసే విధానాలను పూర్తిగా పునర్ నిర్వచించాం. లాక్ డౌన్ వల్ల రోడ్డు ప్రమాదాలలోమరణాలు చాలావరకు తగ్గాయి. కానీ, గుండెనొప్పి, పక్షవాతం, ఇంట్లో కాలుజారి పడిపోవడం, కాలినగాయాలు, విద్యుత్ షాక్ లాంటివి పెరిగాయి. పురిటినొప్పులు, ప్రసవ సమయంలో వచ్చే గుర్రపువాతం, బ్రాంకియల్ ఆస్తమా, సీఓపీడీ లాంటి సమస్యల విషయంలో తగినంత ముందుగా చికిత్సలు అందించడం తప్పనిసరి. కానీ ఇలాంటి తీవ్రమైన సమస్యల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్ల ఆసుపత్రికి వచ్చినా, రాకపోయినా ఇలాంటి కేసుల విషయంలో తగిన వైద్య సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం’’ అని డాక్టర్ పాటిబండ్ల శ్రీ సౌజన్య వివరించారు. ‘‘గర్భిణిని మా ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆమెకు స్పృహ లేదు. 100 కిలోమీటర్లు ప్రయాణించినా, ఈ మధ్యలో ఎక్కడా ఆమెకు తగిన వైద్యం అందలేదు. సమష్టి వైద్య చికిత్సలు, బృందంగా పనిచేయడం, వైద్యపరంగా అత్యున్నత ప్రమాణాలు పాటించడం లాంటి వాటి ద్వారా మాత్రమే అసాధ్యం అనుకున్న చికిత్సలను కూడా చేయగలం అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎమర్జెన్సీ అండ్ ట్రామా, ఎనస్థీషియాలజీ, గైనకాలజీ, నియోనాటాలజీ, బ్లడ్ బ్యాంక్, క్రిటికల్ కేర్.. ఇలా అన్ని విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యనిపుణులు సమష్టిగా కృషి చేయడం వల్లే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి నుంచి కూడా ఆమె ప్రాణాలు కాపాడగలిగాం. అంతర్జాతీయ స్థాయి చికిత్స సదుపాయాలు ఉండటం కూడా ఆమె పరిస్థితి అంచనా వేయడానికి, ఇలాంటి క్లిష్టమైన కేసులలో చికిత్స చేయడానికి కీలక పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు’’ అని హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రుల సీఈవో డాక్టర్ రాహుల్ మేడక్కర్ తెలిపారు. కాంటినెంటల్ ఆసుపత్రుల లాంటి సూపర్ స్పెషాలిటీ సంస్థల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అత్యవసర విభాగంలోమరింత జాగ్రత్తగా ఉంటారు. అందులో భాగంగా ఆ డిపార్టుమెంటులో పడకలను తగినంత దూరం ఉండేలా సర్దడం, ప్రత్యేకంగా జ్వరాలు/ఫ్లూ ఎమర్జెన్సీ గదుల ఏర్పాటు, రెస్పిరేటరీ ట్రయేజ్ డెస్కుల ఏర్పాటు, శ్వాసపరమైన సమస్యలు ఉన్నాయేమోనని రోగులు, వారి సహాయకులకు పరీక్షలు, ఫేస్ మాస్కుల వాడకం తప్పనిసరి చేయడం, వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పీపీఈ)ను తగిన విధంగా వాడటం, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం, ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, కొత్త పద్ధతులను పాటించడం లాంటివి చేస్తున్నారు. అందువల్ల రోగులు ఆసుపత్రులపైన, అపారమైన అనుభవం ఉన్న వైద్య నిపుణుల బృందంపైన విశ్వాసం ఉంచాలని కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా తగినంత ముందుగానే ఆసుపత్రులకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవాలని చెబుతున్నారు.
సీహెచ్ఎల్ లో తీసుకుంటున్న జాగ్రత్తలు :

  • ఆసుపత్రి గేటు వద్ద, ఎమర్జెన్సీ గది వద్ద రోగులు, సహాయకులందరికీ జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ప్రయాణ చరిత్రలపై పరీక్ష
  • శ్వాసకోశ సమస్యలు, రీససికేషన్, ప్రాణాలు కాపాడే ప్రక్రియలు చేసే రోగులకు ప్రత్యేక ఎమర్జెన్సీ గది
  • సిబ్బందికి తగిన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు
  • ఆసుపత్రిలోను, వేచి ఉండే సమయంలోను ఫేస్ మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించడం
  • అత్యవసర గదిలో ఎక్కువ మంది ఉండకుండా చూడటం, అవసరాన్ని, ప్రాధాన్యాన్ని బట్టి వేగంగా చికిత్సలు చేయడం
  • ఆసుపత్రి పరిసరాలను నిరంతరం బాగా శుభ్రం చేయడం, డిజిన్ఫెక్షన్ చేయడం
  • అనుమానిత కేసులు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్ష, చికిత్స ప్రాంతాలు