24 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసిన కిమ్స్ కర్నూలు వైద్యులు
రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (రిర్స్) అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ద్వారా కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 24 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి ఎక్టోపిక్ మూత్రపిండంలో 2 రాళ్లు ఉండటంతో పాటు యువకుడి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ఎక్టోపిక్ మూత్రపిండం అనేది పుట్టుకతో వచ్చే సమస్య. అంటే, మూత్రపిండం సాధారణంగా ఉండాల్సిన చోట కాకుండా స్థానభ్రంశం చెందుతుంది. ఇలాంటి పరిస్థితి ప్రతి 3వేల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఎక్టోపిక్ మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే పరిస్థితి సంక్లిష్టంగా మారి, చికిత్స చేయడానికి వైద్య బృందానికి అత్యున్నత స్థాయి నైపుణ్యం అవసరం అవుతుంది. గత 6 నెలలుగా కడుపులో ఉన్నట్టుండి నొప్పి వస్తోందన్న కారణంతో ఈ యువకుడిని కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడికి వైద్య పరీక్షలు చేసినప్పుడు ఎక్టోపిక్ మూత్రపిండాలు అనే అరుదైన పరిస్థితి ఉండటంతో పాటు ఎడమ మూత్రపిండంలో 18 మి.మీ., 4మి.మీ. పరిమాణంలో రెండు రాళ్లున్నట్లు గుర్తించారు. కుడివైపు మూత్రపిండం సాధారణంగానే ఉంది. గత సంవత్సర కాలంగా యువకుడు ఈ సమస్యతో బాధపడుతూ పలు ఆసుపత్రులకు తిరిగినా, ఈ శస్త్రచికిత్స బాగా సంక్లిష్టమైనది కావడంతో ఎవరూ చేయలేదు. ఈ కేసు గురించి కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ వై. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘గత దశాబ్ద కాలంగా మూత్రపిండాల్లో రాళ్ల ఉండటం అనేది సాధారణంగా మారిపోయింది, ఇది క్రమేణా పెరుగుతోంది. కానీ, ఈ కేసులో మూత్రపిండం వేరే స్థానంలో ఉండటం వల్ల బాగా సంక్లిష్టంగా మారింది. అతడు గత ఏడాది కాలం నుంచి దీంతో బాధపడుతుండటంతో వెంటనే రాళ్లు తీసేయాల్సి వచ్చింది. సాధారణంగా 18 మి.మీ. రాళ్లకు అయితే మేం పీసీఎన్ఎల్ అనే చికిత్స చేస్తాం. అందులో మేం మూత్రపిండానికి చిన్న రంధ్రం చేసి దాని ద్వారా రాయి తీస్తాం. కానీ, ఈ యువకుడికి మాత్రం మూత్రపిండం చుట్టూ ప్రేవులు, ఇతర అంతర్గత అవయవాలు ఉండటంతో దానికి రంధ్రం చేయడం చాలా కష్టం. అందువల్ల మేం రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (రిర్స్) అనే ప్రక్రియను చేపట్టాం. ఈ ప్రక్రియలో, ఫైబర్ ఆప్టిక్ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అనే ట్యూబు ద్వారా మూత్రపిండాలను చూస్తూ అందులోనే శస్త్ర చికిత్స చేస్తాం. ఇది ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స కావడంతో సాధారణ శస్త్రచికిత్స కంటే త్వరగా నయమవుతుంది. దాంతోపాటు ఇందులో నొప్పి తక్కువగా ఉంటుందని, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండక్కర్లేదు, శరీరం మీద కోతలు లేకపోవడంతో త్వరగా కోలుకుంటారు’’ అని చెప్పారు.
రోగి నొప్పితో బాధపడుతూ కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన 15 రోజుల్లోగానే రిర్స్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, అతడిని సాధారణ పరిస్థితిలోకి తీసుకురాగలిగారు. రెండు రాళ్లనూ పూర్తిగా తీసేయడంతో పాటు, శస్త్రచికిత్స జరిగిన రెండోరోజే రోగిని ఇంటికి పంపేశారు. రిర్స్ పద్ధతిలో అనుభవం ఉన్న డాక్టర్ మనోజ్ కుమార్ నేతృత్వంలోని కిమ్స్ కర్నూలు యూరాలజీ బృందం ఇటీవలి కాలంలో చిన్న పిల్లలకు మూత్ర పిండాల్లో ఉండే రాళ్లకు కూడా సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేస్తోంది.
‘‘రిర్స్ పద్ధతిలో చాలా అత్యాధునిక పరికరాలు అవసరం అవుతాయి. హాల్మియం లేజర్, ఫ్లెక్సిబుల్ స్కోప్ లాంటివి మా వద్ద ఉన్నాయి. దీనికి బాగా నైపుణ్యం కూడా కావాలి. డాక్టర్ నచికేత, డాక్టర్ శ్రుతి లాంటి అత్యుత్తమ మత్తు వైద్యుల బృందం ఉండటం వల్ల కూడా మా పని విజయవంతం కాగలిగింది. సాధారణంగా ఇలాంటి కేసులను హైదరాబాద్ పంపుతారు. కానీ, మంచి మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యం కూడా అందుబాటులో ఉండటంతో దీన్ని మేం తరచు చేస్తూ చాలా సంక్లిష్టమైన కేసులను విజయవంతంగా నయం చేయగలుగుతున్నాం. కర్నూలులో విజయవంతంగా రిర్స్ చేయగలిగినందుకు సంతోషిస్తున్నాం’’ అని యూరాలజీ డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.