విషాదంలో పొడ్చన్‌పల్లి
డెక్కన్ న్యూస్ మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి :
ఎట్టకేలకు సజీవుడై వస్తాడని అనుకున్నారంతా. మళ్లీ అమ్మ, నాన్న, తాతా, అమ్మమ్మ అంటూ అందరిని పలకరిస్తాడు అనుకున్నారంతా. అడవుల్లో వెలిసిన దుర్గమ్మ ఆ బాలుడిని కాపాడంటూ వేలాది మంది వేడుకున్నారు. ప్రాణం పోసే దేవుడు కూడా ఆ అభం శుభం తెలియని చిన్నోడిని కాపాడలేకపోయాడు. నిన్న సాయంత్రం నుండి కొనసాగుతున్న సహాయక చర్యలు అన్ని బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది.
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్ సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అప్పుడే వేసిన బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలుడిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. 25 అడుగుల లోతులో బాలుడు ఉండొచ్చని భావించి, బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు. కానీ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.