కోకాపేట భూములు హెచ్ఎండిఏ వే : హైకోర్టు

కోకాపేట భూములు హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ)కే చెందుతాయని మరోసారి హైకోర్టు తీర్పు వెలువరించింది. కోకాపేట భూములపై గత 15 సంవత్సరాలుగా కోర్టుల్లో(హైకోర్టు, సుప్రీంకోర్టు) పిటిషనర్లు కేసులు వేసి ఓటమిపాలయ్యారు. గతంలో రెండు సార్లు హైకోర్టు కోకాపేట భూములపై హెచ్​ఎండిఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఈ భూములు హెచ్​ఎండిఏ కే చెందినవని గతంలో తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది పిటిషనర్లు కోకపేట భూములను జేఎస్​.కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గరి నుంచి కొనుగోలు చేశామని, జేఎస్​.కృష్ణమూర్తి దివంగత(లేట్​) నవాబ్​ నస్రత్​ జంగ్​ బహదూర్​‌‌–1కు జనరల్​ పవర్​ ఆఫ్​ అటార్నీ(జీపీఏ) హోల్డర్​ అంటూ హైకోర్టులో రెండు పిటీషన్లు వేసి స్టేటస్​కో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. హైకోర్టులో రెండు పిటీషన్లపై హెచ్​ఎండిఏ తరపున సుప్రీంకోర్టు సీనియర్​ న్యాయవాది వి.గిరి వాదనలు వినిపించారు. అంతకు ముందు ఇదే వ్యక్తులు హైకోర్టులో కేసులు వేసి ఓడిపోయారని హెచ్​ఎండిఏ న్యాయవాది గిరి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసు పూర్వోపరాలను విచారించిన హైకోర్టు హెచ్​ఎండీఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా పిటీషనర్లు ఇంతకు ముందే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసు ఓడిపోయిన విషయాన్ని దాచిపెట్టి (మరుగునపెట్టి) మళ్లీ హైకోర్టులో కేసు(2019 అక్టోబర్​ 8న ) వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో కోకాపేట భూములపై 2017 అక్టోబర్​ 4వ తేదీన సుప్రీంకోర్టు హెచ్​ఎండిఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పిటీషనర్ల తీరును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వారికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. హైకోర్టు తీర్పుతో కోకాపేట భూములను అభివృద్ధి చేయాలన్న హెచ్​ఎండిఏ ఆశయానికి ఆటంకం తొలగిపోయింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువజేసే కోకాపేట భూముల వివాదం హైకోర్టు తీర్పుతో సమసిపోయింది.