జూన్ 1 నుండి తెరుచుకోనున్న ఆలయాలు
భక్తులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆలయాలు తెరవనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు 51 ఆలయాల్లో దర్శనానికి బుధవారం నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటికే ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల వల్ల అనేక కార్యకలాపాలు తిరిగి కొనసాగుతున్నాయి. దీంతో ఈ నెలాఖరుకు ముగియనున్న నాల్గవ లాక్‌డౌన్ అనంతరం దేవాలయాలను తెరవనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
త్వరలోనే ఆలయాల్లో దర్శనాలకు అనుసరించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అలాగే రాష్ట్రంలో మసీదులు, చర్చిలను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్ గురువారం చర్చ జరిపే అవకాశం ఉంది. కాగా కర్ణాటకలో నేడు కొత్తగా 100 కరోనా కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య 2,282కు చేరింది. కరోనా కారణంగా 44 మంది మరణించగా 705 మంది కోలుకున్నారు.