తెలంగాణలో కమలంతో జనసేనాని ?
రానున్న రోజులతో తెలంగాణలో జనసేన పార్టీతో బీజేపీ కలిసి పనిచేయనుంది. ఇందుకు నిదర్శనంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ జరిగిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో సోమవారం సాయంత్రం వీరు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తుండగా.. ఈ పొత్తును తెలంగాణలోనూ కొనసాగించాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పవన్, సంజయ్ భేటీ అయినట్లు రాజకీయ వర్గాల సమాచారం. మరోవైపు వీరి భేటీలో రాజకీయ కోణం ఏదీ లేదని, కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
కాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారథిగా సంజయ్ బాధ్యతలు స్పీకరించిన తరువాత ట్విటర్ ద్వారా పవన్ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్-సంజయ్ భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సంజయ్ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఇక ఢిల్లీ కేంద్రంగా జనసేన-బీజేపీ పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని జసేన-బీజేపీ నేతలు అధికారికంగా ప్రకటించారు.