ఇకపై అవి ఉండవు : ‘బాహుబలి’ నిర్మాత

సినిమా పరిశ్రమ దారుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సెలబ్రిటీలందరూ పని చేసి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా? షూటింగ్‌లతో బిజీ అవుతామా! అని ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అన్నిటికీ సడలింపులు వస్తున్నాయి కానీ.. షూటింగ్స్, థియేటర్స్ పరిస్థితి మాత్రం ఏమిటి? అని అడిగితే మాత్రం ఏ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదు. బహుశా ప్రస్తుత లాక్‌డౌన్ 4.0 తర్వాత ఏమైనా వీటి గురించి సమాచారం రావచ్చు. అయితే షూటింగ్స్, థియేటర్స్ గురించి ప్రకటన వచ్చినప్పటికీ ఇకపై సినిమా ఇండస్ట్రీలో అనేక రకాలు మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ.
‘బాహుబలి’తో అన్ని సినీ ఇండస్ట్రీల మార్కెట్ తెలుసుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇకపై ఫిల్మ్ మార్కెటింగ్‌లో విభిన్నమైన మార్పులు వస్తాయి. ఇంకా చెప్పాలంటే సినిమాకు సంబంధించి పబ్లిక్ వేడుకలు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో రిలీజ్, సక్సెస్ మీట్స్ వంటివి దాదాపు ఉండవు. అలాగే సినిమాకు సంబంధించి డిజిట‌ల్ మార్కెటింగ్‌, ఆన్‌లైన్ సంభాష‌ణ‌లు ఎక్కువ‌గా నడుస్తుంటాయి. ఇలా సినిమాలకు సంబంధించి సమూల మార్పులు జరుగుతాయి..’’ అని చెప్పుకొచ్చారు.