పదో తరగతి పరీక్షలు రద్దు : సీఎం నిర్ణయం

పదో తరగతి పరీక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్‌ జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రద్దైన పరీక్షలకు సంబంధించి ‘పాస్‌’ రిమార్క్‌తో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు చెప్పారు. మార్చి 19 నుంచి లాక్‌డౌన్‌ ముగిసేవరకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. మరోవైపు మిగిలిపోయిన ఇంటర్‌ పరీక్షలను మాత్రం జూన్‌ 8 నుంచి జూన్‌ 16 మధ్యలో నిర్వహించాలని మధ్యప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్ణయం తీసకుంది. కాగా మధ్యప్రదేశ్‌లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత.. కరోనా లాక్‌డౌన్‌తో మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.