ఇలాగైనా శ్రీరెడ్డికి న్యాయం జరుగుతుందా ?

శ్రీ రెడ్డి పరిచయం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వారికే అవకాశాలు కల్పించాలి అంటూ ఫిలింనగర్ ఛాంబర్ వద్ద అర్ధ నగ్న ప్రదర్శన చేసిన ధీర వనిత. కాస్టింగ్ కౌచ్ మీద అప్పట్లో చేసిన హడావుడి అంత ఇంత కాదు. ఒకానొక సమయంలో పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు కూడా భయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఆమె అంత చేసినా… ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే… హైదరాబాద్ లో ఆ దుమారం లేచిన తరువాత శ్రీ రెడ్డి తమిళనాడు లోని చెన్నైకి మారిపోయంది. ఆమె అక్కడికి వెళ్లిన తెలుగు సినిమా రంగం కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ఎప్పటికైనా ఆమె చేసిన పోరాటానికి కొద్దిగా ఫలితం దక్కే అవకాశం ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోయాయి. తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ ఈ ఎఫెక్ట్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే కొన్ని కొన్ని రంగాలకు విముక్తి లభించినా సినీ పరిశ్రమకు మాత్రం ఎప్పుడు విముక్తి లభిస్తుందో? అనేది చెప్పలేని పరిస్థితి. కొన్ని చోట్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు అంటూ కొన్ని రాష్ట్రాలు అవకాశం కల్పించినా.. థియేటర్స్ లేకుండా సినిమా పూర్తయినా ఉపయోగం లేదు. సరే ఆ సంగతి పక్కన పెడితే రీసెంట్‌గా ప్రధాని మోదీ విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులను మాత్రమే వాడండి అంటూ పిలుపునిచ్చారు. మరి ఈ పిలుపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుందా? నిజంగా వర్తిస్తే మాత్రం తెలుగు హీరోయిన్‌లకు మంచి రోజులు వచ్చినట్టే.
ఎందుకంటే మన హీరోలకు అలాగే ప్రేక్షకులకు తెలుగు హీరోయిన్లు అంటే నచ్చరు. అదే తెలుగు హీరోయిన్లు ఇతర సినిమా ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్నారు. ఇక్కడ మాత్రం వారికి అవకాశాలు లేవు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఎక్కడివారు అక్కడే అనే నినాదం గట్టిగా వినిపిస్తుంది. ఈ లెక్క ప్రకారం విదేశీ భామలకు ఎలాగూ ఛాన్స్ ఉండదు కాబట్టి.. ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తీసుకువచ్చి షూటింగ్స్ చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు అందుబాటులో ఉన్న తెలుగు భామలకు అవకాశం ఇస్తారా? లేదంటే ఎంత ఖర్చు అయినా పెడతాం.. వారే కావాలని అంటారా? కరోనాతో చాలా చోట్ల మార్పులు సంభవించాయి. మరి సినీ ఇండస్ట్రీలో కూడా ఈ మార్పులు సంభవిస్తాయా? ఏం జరుగుతుందో చూద్దాం..?