నెల్లూరు కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
ఏపీలో ఒకదాని వెనుక మరో ఘటన ప్రజల్ని భయపెడుతున్నాయి. వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్ ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. నెల్లూరు నగరంలోని బోడిగాడి తోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంటల కారణంగా రసాయనాలు తగలబడుతుండడంతో విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కు చెట్ల కొమ్మలు తగలడంతో మంటలు రేగినట్టు గుర్తించారు. ఈ అగ్నిప్రమాదంపై స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు . మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రత తగ్గించాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు.