హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు అనుమతి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐటీ కంపెనీలలో కేవలం 33 శాతం ఉద్యోగులతో కంపెనీ కార్యకలాపాలకు అనుమతిని ఇస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్‌లో ఐటీ కంపెనీల యాజమాన్యంతో సీపీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య లాగిన్ అవ్వాలని.. మళ్లీ సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్ అవుట్ కావాలని చెప్పారు. ఇక కంపెనీ అధికారిక లెటర్‌ను ప్రతీ ఉద్యోగీ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో కంపెనీ కార్యకలాపాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ రవాణా బస్సులలో సైతం సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన సూచించారు. ప్రతీ కంపెనీలో శానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు ఉండాలని, సంస్థ ఆవరణం ఉద్యోగులు గుంపులుగా ఉండకూడదని హెచ్చరించారు. కంపెనీలో క్యాంటీన్‌లకు అనుమతి లేదని సజ్జనార్ వెల్లడించారు.