లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలి : ముఖ్యమంత్రి

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ప్రజలు తప్పక పాటించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్షించారు. లాక్ డౌన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాలు- రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, శాంత కుమారి, జనార్థన్ రెడ్డి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.