ఆర్ధికరంగం కోలుకోవడానికి చాల సమయం పడుతుంది

కరోనా లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థికరంగం గాడిలో పడాలంటే చాలా సమయం పడుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో చేసిన పలు సర్వేల ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో కుదేలైన ఎకానమీ కుదురుకునేందుకు చాలా సమయం పడుతుందని పరిశ్రమ సంస్థ సీఐఐ స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఏడాది సమయం పడుతుందని సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వే వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసంలో రాబడులు 40 శాతం పైగా పడిపోతాయని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకునేందుకు ఏడాది సమయం పడుతుందని 45 శాతం మంది సీఈఓలు అంచనా వేశారు. లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల్లో కోత తప్పదని సగానికి పైగా సంస్థలు వెల్లడించాయి. 15 నుంచి 30 శాతం వరకూ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని 45 శాతం మంది సీఈవోలు పేర్కొన్నట్టు సర్వే వెల్లడించింది. ఇక తమ సంస్థల్లో వేతన కోతను అమలు చేయబోమని మూడింట రెండువంతుల మంది సీఈవోలు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది.