మనమంతా సాయం చేద్దాం
కూకట్‌పల్లి ఓమ్ని ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ మంజునాథ్ ఒకరోజు ఆసుపత్రికి వెళ్తుండగా కొందరు ఆహారం దొరక్క ఇబ్బంది పడటం గమనించారు. ఈ విషయాన్ని ఆయన ఆసుపత్రిలో ఉన్న తన సహోద్యోగులకు తెలిపారు. దాంతో ఆసుపత్రిలోని మొత్తం సిబ్బంది, ఓమ్ని ఆసుపత్రుల గ్రూపులోని అన్ని ఆసుపత్రుల సిబ్బంది కలిసి తమ చుట్టుపక్కల ఉన్నవారి ఆకలి తీర్చాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి కుటుంబాలను స్థానిక పోలీసుల సాయంతో గుర్తించి, వారికి ఉచితంగా సరకులు పంపిణీ చేశారు. దాంతోపాటు, ఆ సమీపంలోనే కొంతమంది వలసకూలీలు కూడా నివసిస్తున్నట్లు వారికి తెలిసింది. దాంతో కొంతమంది వైద్యులు కలిసి, లాక్‌డౌన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించి, ఆహారం కూడా అందించారు. హైదరాబాద్ నాంపల్లి, విశాఖపట్నంలలో ఉన్న ఇతర ఓమ్ని ఆసుపత్రులలోనూ ఇలాంటి సాయం చేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ సమయంలో వారికి అవసరమైన సరకులు, ఆహారంవంటివి అందించేందుకు ఓమ్ని ఆసుపత్రుల సిబ్బంది తమవంతు విరాళాలు అందించారు. మొత్తం అన్ని ఓమ్ని ఆసుపత్రులలో ఉన్న సిబ్బంది ఇదే తరహా కార్యక్రమం ప్రారంభించి పేదలకు, అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయాలని నిర్ణయించారు. మొత్తం అన్ని ఓమ్ని ఆసుపత్రులకు చెందినవారితో కలిపి ఓమ్ని ఆసుపత్రుల గ్రూప్ సీవోవో డాక్టర్ కె. నాగేశ్వర్ ఒక బృందం ఏర్పాటుచేసి, ఈ కార్యక్రమం సమర్థంగా నడిచేలా చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనిలా చెప్పారు.. “మేం ప్రతిరోజూ ఆసుపత్రులకు వస్తుంటాం. అదే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు ఆహారం, మంచినీరు, మందుల్లాంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరని దృశ్యాలు చూస్తాం. దాంతో వారికి సాయం చేయాలన్న ఆలోచన మాకు కలిగింది. దీనికి ముందడుగు వేసింది మా ఉద్యోగులే. సమాజం పట్ల వారికున్న సెంటిమెంటుకు మేం వారికి ఎంతగానో కృతజ్ఞతలు చెబుతున్నాం. మా వైద్యులు కూడా ముందుకొచ్చి వారికి సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో మాకు అండగా నిలిచిన పోలీసులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు.”