మాస్క్ లేకుంటే 5000 ఫైన్ లేదా మూడేళ్లు జైలు శిక్ష ఎక్కడో తెలుసా ?

ఇక నుండి బయటకి వస్తే మాస్క్ తప్పకుండ పెట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుంటే 5000 ఫైన్ వేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి కేరళలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. బహిరంగప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి భారీ జరిమానా వడ్డిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరైనా బయటకు వస్తే రూ 5000 జరిమానా వసూలు చేస్తామని వయనాద్‌ ఎస్పీ ఇలంగో బుధవారం వెల్లడించారు. మాస్క్‌ ధరించని వ్యక్తిపై కేరళ పోలీస్‌ చట్టం 118 ఈ కింద కేసు నమోదు చేస్తామని, ఈ చట్టం కింద రూ 5000 జరిమానా వసూలు చేస్తామని చెప్పారు. కోర్టులో కేసును ఎదుర్కొనేందుకు సిద్ధపడితే ఆయా వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ 10,000 జరిమానా లేకుంటే రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇదే కాకుండా షాపులు నిర్వహించే వారు తమ షాపుల్లో సోప్స్‌ లేదా శానిటైజర్లను ఉంచకుంటే రూ 1000 జరిమానా వసూలు చేస్తామని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.