తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించండి

మంచి రోడ్లు ప్రగతికి చిహ్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో అన్నారు.మంగళవారం హైదరాబాద్ లోని NIC బిల్డింగ్ నుంచి మంత్రి వేముల కేంద్ర మంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కేంద్ర రవాణా శాఖ నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఖమ్మం నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. రవాణా గురించి మంత్రి పువ్వాడ వివరించగా…నేషనల్ హైవే రోడ్ల గురించి మంత్రి వేముల మాట్లాడారు.తెలంగాణ లో నేషనల్ హైవే రోడ్లను విస్తరించాలని ఆయన నితిన్ గడ్కరీని కోరారు. రోడ్ల అభివృద్ధి కోసం,కేంద్రం ఇచ్చిన హామీ మేరకు నూతన జాతీయ రహదారుల డిక్లరేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు.రాష్ట్రంలో నిర్మాణం లో ఉన్న నేషనల్ హైవే పనుల గురించి కేంద్ర మంత్రికి వివరించారు.ఫారెస్ట్ ల్యాండ్ కు సంబంధించి క్లియరెన్స్ లు ఇవ్వాలని…లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని చోట్ల ఆన్ గోయింగ్ వర్క్స్ ఆగిపోయినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని,మీది మా పక్క రాష్ట్రమే కనుకా ఇక్కడి రవాణా వ్యవస్థ గురించి బాగా తెలుసన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు కొత్త రోడ్లు,పెండింగ్ రోడ్ల పురోగతి కోసం మీతో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన హామీమీరకు నూతన రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.రీజనల్ రింగ్ రోడ్డు పనులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రితో పాటు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, NHA అధికారులు పాల్గొన్నారు.