సిద్దమైన కోహెడ పండ్ల మార్కెట్
తెలంగాణ ప్రజలకు పండ్ల మార్కెట్ అందుబాటులోకి రానుంది. కొహెడలోని పండ్ల మార్కెట్‌ను మూడు రోజుల్లో ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పండ్లమార్కెట్ పనులను విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. మార్కెట్ ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి మార్కెట్ వరకు వెంటనే లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల్లో మామిడి పంటను సాగుచేశారని, ఇప్పటికే అనధికారికంగా మామిడి రాక మొదలయ్యిందని వెల్లడించారు. రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటిన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్‌లో సీసీ కెమెరాలు, ప్రాథమిక చికిత్స కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, పార్కింగ్ మొదలైన సౌకర్యాలు సిద్ధమయ్యాయని, తాగునీటి కోసం రెండు వేల లీటర్ల ట్యాంకులను 20 ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ ఏంజెట్లు, సహాయకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రైతులు, ఏజెంట్లు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాంనర్సింహ గౌడ్ పాల్గొన్నారు.