మమల్ని ఆదుకోండి : పోచారం

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో కరోనా వైరస్ ప్రవేశం సమయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా నివారణపై శాసనసభలో లఘు చర్చ జరిపాం. శాసనసభ సమావేశాల రోజులను తగ్గించి శాసనసభ్యులను, అధికారులను క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి పంపించడం జరిగింది. లాక్ డౌన్ ప్రకటించగానే రాష్ట్రంలో ఉన్న 80 శాతం పేదలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలోని 87 లక్షల 59 వేల వైట్ రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబంలోని ఒక్కొకరికి 12 కేజీల చొప్పున 2 కోట్ల 80 లక్షల మందికి బియ్యం అందించడం జరిగింది. ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రతి కుటుంబానికి రూ. 1500 చొప్పున బ్యాంకుల ద్వారా నగదును పంపిణీ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు కూడా మనిషికి 12 కిలోల బియ్యంతో పాటు రూ. 500 లను అందించడం జరిగింది. వలస కూలీలను ఆదుకోవడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది. కరోనా కేసులలో 22 శాతం మంది చికిత్స తరువాత ఆరోగ్య వంతులుగా డిశ్చార్జి అయ్యారు.
మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 2.44 శాతం మంది మాత్రమే మృతి చెందారు. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు.కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున పరికరాలను, ఇతర వసతులను కల్పించింది. 3 లక్షల PPE కిట్స్, N-95 కిట్స్ 3 లక్షలు, 36.5 లక్షల 3ప్లై మాస్క్ లు, 15,807 మంది అదనపు మెడికల్ స్టాఫ్ ను సమకూర్చడం జరిగింది. కరోనా రోగులకు ఆధునిక వైద్యం అందించడానికి గచ్చిబౌలిలో 1500 పడకలతో ప్రత్యేక హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని వివరించారు. లోక్ సభ స్పీకర్ గా తమరు దేశ ప్రధానమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రాలకు అదనపు నిధులను మంజూరు చేయించగలరని విజ్ఞప్తి చేసారు.