ఆన్‌లైన్ భోజన ప్రియులకు చేదు వార్త
కరోనా వచ్చిన నాటి నుండి ఇంట్లో రకరకాలుగా వంటలు వండుకొని ఆరగించి…. కాస్త వెసులు బాటు కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటే … మీకు అదే చివరి భోజనం కావొచ్చు. ఇలా చెబుతున్నాను అంటే … దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా సోకిన ఘటన మరువకముందే హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దీనికి తబ్లిగి జమాత్ సభ్యుల ఆధ్యాత్మిక కార్యక్రమానికి లింకు ఉండటంతో మర్కజ్ నీడలు ఇంకా చెరిగిపోలేదని రుజువు చేస్తోంది. నాంపల్లిలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సుమారు ఏడాది నుంచి ఆన్‌లైన్ ఫుడ్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిరాగా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని కుటుంబం మొత్తాన్ని సరోజినీ దేవీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో డెలివరీ బాయ్ నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. తాజా ఫలితాల్లో శనివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతను ఏయే రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని సేకరించాడు? ఎక్కడెక్కడ ఫుడ్ డెలివరీ చేశాడు? అనే వివరాలను సేకరిస్తున్నారు. సుమారు 25 మందికి ఫుడ్ డెలివరీ చేశాడని ప్రాథమికంగా అంచనా వేస్తుండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అతనితోపాటు పనిచేసిన వారందరూ వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు.