24 గంటల్లో దేశంలో 1334 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 27 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15,712కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 507 మంది మరణించారని ఆ శాఖ సంయయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 2,231 మంది కోలుకున్నారని చెప్పారు. మొత్తం కేసుల్లో ఇది 14.19 శాతమని చెప్పారు. ఈ మేరకు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగులో గత 28 రోజుల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ చెప్పారు. మరో 54 జిల్లాల్లో గడిచిన 14 రోజుల్లో కొత్తగా ఒక్క కొవిడ్-19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. కొవిడ్-19 కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 755 ఆస్పత్రులు, 1,389 ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. అభివృద్ధిని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అన్నీ నిబంధన ప్రకారమే జరుగుతాయని చెప్పారు.
ఇప్పటి వరకు దేశంలో 3,86,791 నమూనాలను పరీక్షించామని, నిన్న ఒక్కరోజే 37,173 నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్ వివరించారు. అందులో 29,287 టెస్టులు ఐసీఎంఆర్ పరిధిలోని ల్యాబ్స్‌లోనూ, 7886 పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ నిర్వహించినట్లు తెలిపారు.











