రోహింగ్యాల వేటలో పోలీసులు

కరోనా కలకలం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాముద్దీన్ ఘటన మరో సంచలనానికి దారి తీసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 6040 మంది రోహింగ్యాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది రోహింగ్యాలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 మంది.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది రోహింగ్యాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.