హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత
రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల కాలంలో 3027 ఇళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అమ్మకాల క్షీణతలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. రియల్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్‌ఎల్ తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక మందగమనం కారణంగా ప్రజలు ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకోవడం ఇందుకు కారణమని జేఎల్‌ఎల్ కంట్రీహెడ్, సీఈఓ రమేశ్ నాయర్ తెలిపారు. మొత్తం 7 నగరాల్లోనూ కలిపి ఇళ్ల అమ్మకాలు 29 శాతం తగ్గి 27,451కి పడిపోయాయి. అమ్మకం కాని ఇన్వెంటరీ 3.65 లక్షలకు పెరిగిపోయింది.